శబరిమలలో అన్నదానంపై షరతులు!

24 Dec, 2013 03:42 IST|Sakshi
శబరిమలలో అన్నదానంపై షరతులు!

అన్నదానానికి రూ.లక్ష కట్టాలంటూ ఒత్తిడి
నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని..
అయ్యప్ప భక్తుల డిమాండ్


 అత్తిలి(పశ్చిమ గోదావరి), న్యూస్‌లైన్: కేరళలోని శబరిమలలో ఉన్న ప్రసిద్ధ అయ్యప్ప సన్నిధానంలో భక్త బృందాలు నిర్వహించే అన్నదానాలపై ట్రావెన్ కోర్ దేవస్థానం షరతులు విధించింది. అయ్యప్పమాల ధరించి, వ్యయ ప్రయాసలకోర్చి శబరిమల వెళ్లే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భక్తుల ఆకలి తీర్చేందుకుగాను రాష్ట్రంలోని పలు అయ్యప్ప భక్త సమాజాలు ఎన్నో ఏళ్లుగా అక్కడ అన్నదానం చేస్తున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలికి చెందిన భక్త బృందం 40 ఏళ్లుగా మకరజ్యోతి సమయంలో 5 రోజులపాటు వేలాది మంది భక్తులకు అన్నదానం నిర్వహిస్తోంది. ఈసారి కూడా అన్నదానం నిర్వహించేందుకు అనుమతినివ్వాలని కోరుతూ గురుస్వామి ఇంటి శ్రీనివాసరావు ట్రావెన్‌కోర్ దేవస్థానం కమిషనర్‌కు దరఖాస్తు చేశారు. అయితే, జనవరి 10 నుంచి 14 వరకు రోజుకు రూ.లక్ష చొప్పున, జనవరి 1 నుంచి 9 వరకు రోజుకు రూ.10 వేల చొప్పున దేవస్థానానికి విరాళమిస్తేనే అన్నదానానికి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. దీంతో తాము తీవ్ర నిరాశకు గురయ్యామని, ఇలాంటి ఆంక్షలు ఎత్తివేసేలా మన రాష్ట్ర ప్రభుత్వం కేరళ సర్కారుతో మాట్లాడాలని శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. అన్నదానం నిర్వహించకపోతే రాష్ట్రం నుంచి వెళ్లే స్వాములను సన్నిధానంలో పట్టించుకునే దిక్కు ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు.

>
మరిన్ని వార్తలు