గాయపడిన భారతీయుడి పరిస్థితి విషమం

2 Jan, 2014 11:19 IST|Sakshi

ఆస్ట్రేలియాలో స్థానికుల దాడిలో గాయపడిన భారతీయ విద్యార్థి మనిరాజ్విందర్ సింగ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అతడి సోదరుడు యద్వేందర్ సింగ్ గురువారం ఇక్కడ వెల్లడించారు. ఆల్ఫ్రెడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మనిరాజ్విందర్ సింగ్ ఇంకా కోమాలోనే ఉన్నాడని, అయితే వైద్యులు అందించే మందులకు మనిరాజ్విందర్ బాగానే స్పందిస్తున్నాడని తెలిపారు. తన సోదరుడికి ఆల్ఫ్రెడ్ ఆసుపత్రి వైద్యులు మెరుగైన వైద్యం అందించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

 

అలాగే తన సోదరుడిపై దాడికి తెగబడిన నిందితలలో ముగ్గురని అరెస్ట్ చేయడం పట్ల విక్టోరియా పోలీసులను ఆయన అభినందించారు. గత ఆదివారం మెల్బోర్న్లోని ప్రిన్సెస్ బ్రిడ్జ్పై మనిరాజ్విందర్ సింగ్ మరో ఇద్దరి స్నేహితులతో కలసి ఉండగా, ఎనిమిది మంది వ్యక్తులతో కూడిన బృందం ఒకటి మనిరాజ్విందర్తోపాటు మరో స్నేహితుడిపై దాడికి తెగబడింది. అనంతరం వారు పరారయ్యారు. బృందం చేసిన దాడిలో మనిరాజ్విందర్ తలకు తీవ్రంగా గాయమై కోమాలోకి వెళ్లగా మరోకరు గాయపడ్డారు. దాంతో స్థానికులు మనిరాజ్విందర్ను అతడి స్నేహితుడిని ఆల్ఫ్రెడ్ ఆసుపత్రికి తరలించారు.

 

ఆ దాడిపై విక్టోరియా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మన్విందర్ సింగ్ ఆస్ట్రేలియాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న సంగతి తెలిసిందే. మనిరాజ్విందర్ సింగ్ పరిస్థితిపై ఆస్ట్రేలియాలో భారతీయ రాయబార కార్యాలయాన్ని ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.

మరిన్ని వార్తలు