బ్రిటన్ యువకుడితో తెలుగమ్మాయి పెళ్లి

9 Feb, 2015 12:11 IST|Sakshi
బ్రిటన్ యువకుడితో తెలుగమ్మాయి పెళ్లి

విశాఖపట్నం: దేశాలు వేరు.. ఖండాలు వేరు.. సంప్రదాయాలు వేరు.. అయినా వారి మధ్య స్నేహం కుదిరింది.. ప్రేమగా మారింది.. పెద్దల అంగీకారంతో వారికి కనులపండువగా పెళ్లయింది. రుషికొండలోని సాయిప్రియ రిసార్ట్స్ అందుకు వేదికైంది. బ్రిటన్‌కు చెందిన మోరిస్ విలియం డీన్‌కు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బండి నేహకు తెలుగువారి సంప్రదాయ పద్ధతిలో ఆదివారం వివాహం జరిగింది. ఈ పెళ్లికి బ్రిటన్ నుంచి మోరిస్ విలియం తల్లిదండ్రులు, చెల్లి, బావ, బంధువులు హాజరయ్యారు. కొబ్బరి బోండం పట్టుకొని నూతన దంపతులను కల్యాణ మండపం వద్దకు ఆహ్వానించడం, కాళ్లు కడిగి కన్యాదానం చేయడం, వధూవరుల తలపై జీలకర్ర, బెల్లం పెట్టడం, కంకణాల తంతు, వేద మంత్రాలతో పూజలు అన్నీ తెలుగువారి పద్ధతిలోనే జరిపారు.

ఇదీ నేపథ్యం..
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బండి రామ్‌ప్రసాద్, రాధిక దంపతుల కుమార్తె నేహ. రాంప్రసాద్, రాధిక వత్తిరీత్యా ముంబైలో బ్యాంక్ ఉద్యోగులు. నేహ యూకేలో ఎంఎస్ (ఎకనామిక్స్) చదివింది. అక్కడ తనతో చదువుతున్న మోరిస్ విలియం డీన్‌తో పరిచయం పెరిగి ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకొన్నారు. ఇద్దరి తల్లిదండ్రులను ఒప్పించారు. పెద్దలు దగ్గరుండి ఈ పెళ్లి జరిపించారు. ప్రస్తుతం నేహ జర్మనీలో ఉద్యోగం చేస్తోంది. మోరిస్ విలియం యూకేలో ఉద్యోగం చేస్తున్నాడు. తన తమ్ముళ్లు విశాఖలో ఉండటం, పీజీ ఇక్కడే ఏయూలో చదువుకోవడం వల్ల విశాఖపై అభిమానంతో ఇక్కడ ఉన్న స్నేహితులు, గురువులు, బంధువుల మధ్య ఈ వివాహం జరిపించినట్లు రాంప్రసాద్ తెలిపారు.
 
తెలుగు సంప్రదాయం నచ్చింది..
ఈ పెళ్లి అంతా కొత్తగా ఉంది. మా దేశంలో ఇలాంటి విధానం లేదు. చర్చిలో అరగంటలో వివాహం జరిగిపోతుంది. రెండు, మూడు గంటలు ఇక్కడ పండితులు మంత్రాలతో పెళ్లి జరిపించారు. ఇది మాకు వింతగా అనిపించింది. నేహ మా ఫ్యామిలీలో మెంబరు అయినందుకు హ్యాపీగా ఉంది. ఇక్కడ సంప్రదాయాలు మాకు బాగా నచ్చాయి..
- రాస్ డీన్, రోజర్ డీన్ (పెండ్లి కుమారుడు మోరిస్ విలియం తల్లిదండ్రులు)

మరిన్ని వార్తలు