జస్టిస్ రమణకు డెట్రాయిట్లో ఆత్మీయ స్వాగతం

1 Jul, 2015 13:59 IST|Sakshi

డెట్రాయిట్ : సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణకు అమెరికాలోని డెట్రాయిట్లో ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు.  జులై 2,3,4 తేదీల్లో జరగనున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 20వ మహాసభల్లో పాల్గొనేందుకు  జస్టిస్ వెంకటరమణ మంగళవారం  డెట్రాయిట్ చేరుకున్నారు. స్ధానిక విమానాశ్రయంలో ఆయనకు తానా ప్రాంతీయ ప్రతినిధి యార్లగడ్డ శివరాం నేతృత్వంలో ప్రవాస తెలుగువారు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం భారీ ర్యాలీగా రమణను ఆయన నివాసానికి  తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు, ఢిల్లీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రమణ 2021లో భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టవచ్చునని తెలుగువారు ఆకాంక్షిస్తున్నారు.

జస్టిస్ రమణ వెంట మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కూడా ఉన్నారు. స్వాగత కార్యక్రమంలో తానా అధ్యక్షుడు నన్నపనేని మోహన్, తానా తదుపరి అధ్యక్షుడు వేమన సతీష్, విడిది ఏర్పాట్ల కమిటీ అధ్యక్షుడు చల్లా దంతేశ్వరరావు, డెట్రాయిట్ తెలుగు సంఘం అధ్యక్షుడు శ్రీనివాసన్ గోనుగుంట్లలు పాల్గొని మహాసభలకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్ధానిక ప్రవాసులు మారుపూడి విజయ్, కారుమంచి వంశీ, దుగ్గిరాల కిరణ్, సురేష్ కకుమాను తదితరులను డెట్రాయిట్ ప్రాంతంలో చేస్తున్న సేవలకుగానూ జస్టిస్ రమణ అభినందించారు.

మరిన్ని వార్తలు