త్రిభాషా సూత్రాన్ని పాటించండి: యార్లగడ్డ

23 Jun, 2016 22:35 IST|Sakshi
త్రిభాషా సూత్రాన్ని పాటించండి: యార్లగడ్డ

బ్రాంప్టన్‌(కెనడా): హిందీ ప్రాంతీయులు విశాల దృక్పథాన్ని అలవర్చుకొని, త్రిభాషా సూత్రాన్ని పాటించాలని ప్రముఖ సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ సూచించారు. కెనడాలో విశ్వహిందీ సంస్థాన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ హిందీ కవిసమ్మేళనం ' కావ్యసాగర్' జరిగింది. బ్రాంప్టన్‌లోని ద గోర్-మీడేజ్ కమ్యూనిటీ సెంటర్లో జరిగిన ఈ కవి సమ్మేళనంలో కెనడా, భారత దేశాలకు చెందిన పలువురు హిందీ కవులు పాల్గొని తమ కవితలు, గజళ్లు, గీతాలతో వీక్షకులను ఆకట్టుకున్నారు.

యార్లగడ్డ మాట్లాడుతూ హిందీ ప్రాంతీయులు ఏదో ఒక ఇతర భాషను కూడా నేర్చుకోవాలని, అప్పుడే జాతీయ సమైక్యత సాధించగలమని అన్నారు. విదేశాల్లో హిందీ భాషపై అభిమానం రోజురోజుకు పెరుగుతుందనడానికి కవి సమ్మేళనానికి హాజరైన వారిని చూస్తేనే అర్థం అవుతుందన్నారు. రానా, యూపికా, నారాయణ్ సేవా సంస్థాన్ అనే సంస్థల సహకారంతో నిర్వహించిన ఈ కవి సమ్మేళనంలో రాజస్థాన్‌కు చెందిన ప్రముఖ కవయిత్రి దీపికా ద్వివేదీ'దీప్', ఉత్తర్ ప్రదేశ్ కవయిత్రి మమతా వాష్ణేయ్, టోరంటో భారత రాయభార ప్రతినిధి, ఇంకా పలువురు హిందీ భాషాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో టొరంటో నారయణ సేవాసమితి అధ్యక్షుడు కైలాష్ చంద్రభట్నాగర్ను నిర్వాహకులు జీవన సాఫల్యపురస్కారంతో సత్కరించారు. ఇటీవల పద్మభూషణ్ అవార్డు అందుకున్న యార్లగడ్డను విశ్వహిందీ సంస్థాన్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు.

>
మరిన్ని వార్తలు