'సమైక్య శంఖారావం'కు యూకే ఎన్నారైల మద్దతు

25 Oct, 2013 12:08 IST|Sakshi
'సమైక్య శంఖారావం'కు యూకే ఎన్నారైల మద్దతు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కొరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్ది శనివారం నిర్వహించ తలపెట్టిన సమైక్య శంఖారావం బహిరంగ సభ విజయవంతం కావాలని లండన్లోని ఆ పార్టీ యుకే- యూరోప్ విభాగం ఎన్నారైలు ఆకాంక్షించారు. సమైక్య శంఖారావం సభకు ఎన్నారైలు సంపూర్ణ మద్దతు తెలిపారు. శుక్రవారం లండన్లోని ఎన్నారైలు ఆత్మీయ సమావేశం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నారైలు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు శ్రీ  వైఎస్ అవినాష్ రెడ్డి, ఆ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం కన్వీనర్ మేడపాటి వెంకట్లతో శుక్రవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.



ఈ సందర్బంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ యుకే- యూరోప్ విభాగం అధ్యక్షుడు సందీప్ రెడ్డి మాట్లాడుతూ... సమైక్య శంఖారావం సభ ఏ ఒక్కరికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న సభ కాదని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ నిరంకుశ వైఖరి అవలంభించిందని ఆయన ఆరోపించారు. ఆ పార్టీ అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టేందుకు ఈ సభను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఇప్పటికైనా రాష్ట్ర విభజనపై తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సమైక్య శంఖారావం సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, అలాగే రాజన్న రాజ్యం అవశ్యకతను ప్రజల్లోకి ఆయన రాష్ట్ర ప్రజలకు  పిలుపునిచ్చారు.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు, పరిపాలన అనిశ్చితికి అధికార కాంగ్రెస్, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కుమ్మక్కు రాజకీయాలే ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఆ రెండు పార్టీలు రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. ఆ రెండు పార్టీ లు ఎన్ని కుటిల రాజకీయాలకు పాల్పడిన ప్రజలు వైఎస్ జగన్ పక్షం ఉన్నారని సందీప్ రెడ్డి ఈ సందర్బంగా గుర్తు చేశారు.

 


విలువలు, విశ్వసనీయత వైఎస్ జగన్ డీఎన్ఏ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ యుకే- యూరోప్ విభాగం ఉపాధ్యక్షుడు యోగేంద్ర పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడ్డాయని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి ఒకే తాటిపై నడిపిన మహానేత వైఎస్ఆర్ అని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ విభజనపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అనుసరిస్తున్న వైఖరిపై ఎన్నారైలు నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన రీతిలో బుద్ది చెబుతారని యోగేంద్ర పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు