ఎన్నారైలతో కేటీఆర్‌ ముఖాముఖి

22 May, 2017 14:35 IST|Sakshi
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ర్ట అభివృద్దిలో ఎన్నారైలు కలిసి రావాలని ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్‌ కోరారు. సోమవారం అమెరికా పర్యటనలో భాగంగా ఆయన కాలిఫోర్నియా రాష్ర్ట్లం శాక్రమెంటో పట్టణంలో తెలంగాణ ఎన్నారైలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, పథకాలను మంత్రి వారికి వివరించారు. ముఖాముఖి సందర్భంగా పలు ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. కరెంటు కోతలు, నూతన గురుకులాలు, వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రోత్సాకాలు, పరిశ్రమలకు, పెట్టుబడులకు ఊతమిచ్చేలా చేపట్టిన కార్యక్రమాలను మంత్రి తెలిపారు.
 
ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో కలిసి రావాలని, ఇందుకోసం తాము పుట్టిన గ్రామాల అవసరాల మేరకు కొంతైనా సహకారాన్ని తిరిగి అందించాలని కోరారు. పురపాలక శాఖా మంత్రిగా హైదరాబాద్ నగర అభివృద్దికి చేస్తున్న కృషిని వివరించారు. హైదరాబాద్ కేంద్రంగా ఐటి పరిశ్రమ సాధిస్తున్న ప్రగతిని వివరించిన మంత్రి, ఐటీ రంగంలోని డాటా అనలిటిక్స్, డాటా సెక్యూరిటీ వంటి నూతన రంగాల్లోని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను తెలిపారు.
 
ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ చొరవతో పలువురు ఎన్నారైలు కలసి ఖమ్మంలో ఐటీ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చారని, ఇలాంటి ప్రయత్నానికి మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం ఐటీ టవర్ నిర్మాణం చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పట్టణంలోని వారితో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఎన్నారైలు హాజరయ్యారు.
మరిన్ని వార్తలు