కూతుర్ని గన్తో కాల్చి చంపిన ఎన్నారై సుజాత

30 Jan, 2014 16:23 IST|Sakshi
కూతుర్ని గన్తో కాల్చి చంపిన ఎన్నారై సుజాత
అమెరికా ఫ్లోరిడాలోని  ఓర్లాండోలో తెలుగు విద్యార్థిని కన్నతల్లి చేతిలోనే దారుణ హత్యకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  గుంటూరు జిల్లాకు చెందిన గూడూరు సుజాత... తన 17 ఏళ్ల కుమార్తె చేతనను గన్ తో కాల్చివేసింది. కన్న కూతురిని కాల్చి చంపి, అనంతరం ఆమె కూడా గుండెలపై కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. అంతకు ముందు సుజాత...హత్య...ఆత్మహత్య విషయాన్ని తన సోదరుడు చిత్తలూరి ప్రసాద్కి ఈ మెయిల్ చేసింది. దాంతో అతడు హుటాహుటిన ఫ్లోరిడా చేరుకున్నాడు. అప్పటికే తల్లీ కూతుళ్లిద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారు. అక్కడకు చేరుకున్న అతనికి చేతన మృతి చెందగా, సుజాత తీవ్రంగా గాయపడి కనిపించటంతో పోలీసులకు సమాచారం అందించాడు.

సుజాత ఇంకా ప్రాణాలతో ఉండటంతో ఆమెను చికిత్స నిమిత్తం ఓర్లాండో రీజినల్ మెడికల్ సెంటర్కు తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది.  హత్య, ఆత్మహత్య ఘటనకు కుటుంబ కలహాలే  కారణమని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సంఘటన జరిగినప్పుడు  సుజాత భర్త రావు గూడూరు  అక్కడ లేరు. ఆయన అట్లాంటా వెళ్లి అక్కడినుంచి తిరిగొస్తున్నారు. కాగా ఈ దుర్ఘటన ఆకస్మికంగా జరిగింది కాదని... సుజాత  ఈనెల 2వ తేదీనే గన్ కొన్నారని, పథకం ప్రకారమే  ఈ హత్య జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. సుజాత కోలుకున్నాక...ఆమెను విచారిస్తామని తెలిపారు. దుర్ఘటన జరిగే సమయానికి చేతన నాయనమ్మ ఇంట్లోనే ఉన్నా..ఆమె నిద్రపోతున్నారని తెలుస్తోంది. తాను చనిపోవాలని నిర్ణయించుకున్నానని, తాను మరణించాక ఇక కూతుర్ని చూసుకునేవారు ఎవరూ లేరు కాబట్టి ఆమెను కూడా చంపేస్తున్నానని సుజాత తన సోదరుడికి రాసిన ఈ మెయిల్ సందేశంలో పేర్కొన్నారు.

మరోవైపు చేతన మరణ వార్త విని ఓర్లాండోలోని సెమినోల్ హైస్కూల్లోని ఆమె సహ విద్యార్థులు తీవ్ర దిగ్ర్బాంతికి గురయ్యారు.  చేతన క్లాస్లో  అందరినీ అబ్బురపరచే తెలివైన విద్యార్థి అని , చదువు తప్ప మరో ధ్యాస లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఏ ప్రశ్న అడిగినా వెంటనే సమాధానం చెప్పగల సమర్థురాలని తెలిపారు. అమెరికా అధ్యక్షుడిని కలిసే అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థుల బృందంలో ఈమె కూడా ఒకరు. ఆరేళ్లుగా ఈ కుటుంబం ఓర్లాండోలో ఉంటోంది. సంచలనం రేపిన ఈ దారుణ సంఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మరిన్ని వార్తలు