ఆస్ట్రేలియాలో హరితహారం

23 Jul, 2017 22:33 IST|Sakshi
ఆస్ట్రేలియాలో హరితహారం

మెల్బోర్న్ :
మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఆస్ట్రేలియా శాఖ హరితహారం కార్యక్రమం నిర్వహించింది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లోని విక్టోరియా స్టేట్ ఇంచార్జి సాయిరాం ఉప్పు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల మాట్లాడుతూ, బంగారు తెలంగాణ సాధనలో భాగంగా రాష్ట్రం సుభిక్షంగా మారాలనే ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం తెలంగాణ వ్యాప్తంగా ఒక విప్లవంలా మారిందన్నారు. భవిష్యత్తులో వాతావరణ కాలుష్య నివారణకు, వర్షాభావ పరిస్థితులను పెంపొందించడంలో చెట్ల ప్రాముఖ్యతను వివరించారు. కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు ఆయన పుట్టినరోజు సందర్బంగా తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. పరిపాలనలో వినూత్న సంస్కరణలను ప్రవేశపెడుతూ, బంగారు తెలంగాణ సాధనకు ఒక సైనికుడిలా కృషి చేస్తున్న కేటీఆర్పై ప్రతిపక్షాలు కేవలం తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే  చవకబారు విమర్శలు చేస్తున్నారని నాగేందర్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో కొత్త పరిశ్రమల స్థాపనలో కేటీఆర్ కృషికి జాతీయ స్థాయిలో నాయకులు సైతం ప్రశంసిస్తున్నారన్నారు.

ఈ మూడు సంవత్సరాల్లో తెలంగాణలో జరిగిన అభివృద్ధి 60 సంవత్సరాల కాంగ్రెస్, టీడీపీ పాలనలో జరిగిన విద్రోహానికి ఒక చెంపపెట్టని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రవేశపెడుతున్న వినూత్న పథకాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేయడమే కాకుండా తమ నాయకులపై అవాకులు, చవాకులు పేలే ప్రతిపక్షాల అసలు రంగు ఎండగట్టడంలో టీఆర్ఎస్ పార్టీ ఆస్ట్రేలియా శాఖ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఉపాధ్యక్షుడు డాక్టర్ అనిల్ చీటీ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అర్జున్ చల్లగుళ్ళ, సునీల్ బసిరెడ్డి , సత్యం రావు గుర్జపల్లి , దిలీప్ , సాయి కిరణ్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు