అమెరికా అధ్యక్ష పదవిపై బాలుడి గురి

24 May, 2016 09:07 IST|Sakshi
అమెరికా అధ్యక్ష పదవిపై బాలుడి గురి

లాస్‌ఏంజిల్స్: డాక్టర్ కావాలన్నదే తన ఆశయమని అతి పిన్న వయసులో డిగ్రీ పట్టా పొంది చరిత్ర సృష్టించిన భారత సంతతికి చెందిన అమెరికా బాల మేధావి తనిష్క్ అబ్రహం చెప్పాడు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి ప్రశంశలందుకున్న ఈ పన్నెండేళ్ల చిన్నారి తనకు 18 ఏళ్లు వచ్చేసరి ఈ లక్ష్యాన్ని చేరుకొంటానంటున్నాడు. కాలిఫోర్నియాలోని సక్రమెంటోలో నివసించే తనిష్క్‌కు రెండు ప్రతిష్టాత్మక యూనివర్సిటీల నుంచి ఆహ్వానం అందింది.

యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (యూసీ) డేవిస్, యూసీ శాంతాక్రజ్‌లు తమ క్యాంపస్‌ల్లో చేరాలంటూ కోరాయి. అయితే ఎందులో చేరాలన్నది తనిష్క్ ఇంకా నిర్ణయించుకోలేదు. ‘బయోమెడికల్ ఇంజనీరింగ్ చదివి 18 ఏళ్లు వచ్చేసరికి ఎండీ పట్టా అందుకోవాలనుకుంటున్నా. నేనూ అందరిలా వీడియో గేమ్‌లు ఆడుకొంటూ ఆస్వాదించే సాధారణమైన పిల్లాడినే. నిరంతరం నేర్చుకోవడానికి ప్రాధాన్యం ఇస్తా’ అంటున్న తనిష్క్... గత ఏడాది కాలిఫోర్నియాలోని ఓ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందాడు.

అదే సమయంలో అమెరికన్ రివర్ కాలేజీ నుంచీ పట్టభద్రుడయ్యి రికార్డు సృష్టించాడు. అమెరికా అధ్యక్షుడవ్వాలని కోరుకొంటున్నట్టు చిన్నారి వెల్లడించాడు. తనిష్క్ తండ్రి బిజో అబ్రహం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. తల్లి తజి వెటర్నరీ వైద్యురాలు. కేరళ నుంచి అమెరికా వెళ్లి స్థిరపడ్డారు.  
 

మరిన్ని వార్తలు