గద్వాల నుంచి వచ్చిన జేసీ బ్రదర్స్‌ స్థానికులా?

8 Apr, 2019 10:40 IST|Sakshi

అనంతపురం పార్లమెంటు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తలారి పీడీ రంగయ్య  

సాక్షి, అనంతపురం సప్తగిరి సర్కిల్‌: ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లని వైఎస్సార్‌సీపీ అనంతపురం పార్లమెంటు అభ్యర్థి తలారి పీడీ రంగయ్య తెలిపారు. ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజాభిమానం సంపాదిస్తే వారి కులాన్ని, వారి స్థోమతను చూడరని, కేవలం వారి గుణాన్ని చూసే ప్రజా క్షేత్రంలో విజయాన్ని అందిస్తారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు అర్హతను కలిగి ఉంటారని, వారు గతంలో పనిచేసిన అధికారిగా కాకుండా వారు చేసిన సేవల ద్వారానే గుర్తింపు లభిస్తుందనే నినాదాన్ని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారని తెలిపారు. అలాంటి వారికే పట్టం కట్టేందుకు ప్రజలు తోడ్పడుతారని వివరించారు.

ప్రజాస్వామ్య దేశంలో కనీస మర్యాద కలిగి ఉండడం ద్వారా వారు తమ గుర్తింపును సాధించుకున్నారనే విషయాన్ని గమనించాలన్నారు. అలాంటి వారిని గుర్తించి వారి కుటుంబ నేపథ్యం, ప్రజా క్షేత్రంలో వారికి ప్రజలతో ఉన్న సంబంధాలను ఆధా రంగా చేసుకుని ఉన్నతమైన వ్య క్తులను ఎంపిక చేసి అనంతపురం, హిం దూపురం పార్ల మెంటు, హిం దూపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులుగా కేటాయించిందనే విషయం ప్రతి సామాన్య ఓటరుకు తెలిసిందేనన్నారు. 

జీవితాన్ని చదివిన వారే.. 
అనంతపురం, హిందూపురం పార్లమెంట్‌ , హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులకు బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారేనన్నారు. జీవితాలను చదివిన ఉన్నత ప్రతిభావంతులేనని చెప్పారు. పేదరికం నుంచి పైకి వచ్చినవాళ్లేనని, ప్రజా సమస్యల పరిష్కారినికై  ప్రజాప్రతినిధులుగా కావాలనుకున్నారని తెలిపారు. అదే వారు చేసిన తప్పుగా అభివర్ణించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీలో లేని అసమానతలను ప్రత్యేకంగా రుద్దాలనుకోవడం అవివేకమన్నారు. 

సీసీ పేరు చెప్పగలరా 
పిచ్చి పిచ్చి రాతలు రాయడం కాదు. వాటికి నియమాలు నిబద్ధత, విశ్వసనీయత అనే అంశాలను కలిగి ఉండాలన్నారు. తాను జిల్లాలో పనిచేసిన సమయాల్లో క్యాంప్‌ క్లర్క్‌ ఎవరో పేరు చెప్పగలరా?  ఆ విధంగా పావులు కలిపిన దాఖలాలే లేవు? అలాంటి అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం చాలా దారుణమన్నారు. ఈ విషయంలో తప్పకుండా డిఫర్మేషన్‌ కోరేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
 
తాడిపత్రి రాజకీయాన్ని నడపలేదు 
రాష్ట్రంలోనే బీహార్‌ తరహా రాజకీయం తాడిపత్రిలో కొనసాగుతోందన్నారు. అలాంటి రాజకీయాలకు చరమగీతం పాడాలనే ఉద్ధేశ్యంతో వైఎస్సార్‌సీపీ ఉన్నత ప్రమాణాలు కలిగిన ప్రతిభావంతులను గుర్తించి పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిందన్నారు. దీనిని సాధారణ ప్రజలు ప్రత్యేకంగా గౌరవిస్తున్నారని చెప్పారు. 

జిల్లా ప్రజల అభిమానమే కీలకం 
ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చన్నారు. జిల్లాకు చెందిన వారు కాకపోయిన సీనియర్‌ ఎన్టీఆర్, బాలకృష్ణలను ఈ జిల్లా ఆదరించిందని గుర్తుచేశారు. జిల్లాకు చెందిన నీలం సంజీవరెడ్డిని శ్రీకాళహస్తి, డోన్‌ నుంచి గెలిపించిన తీరును గమనించాలన్నారు. అలాగే తెలంగాణ ప్రాంతానికి చెందిన పీవీ నరసింహరావును నంద్యాల ప్రజలు గెలిపించి ప్రధానిని చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.  జిల్లాలోని సోమందేపల్లికి చెందిన సాయిప్రతాప్‌ను కడప జిల్లాలోని ప్రజలు ఆదరించారని చెప్పారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ నుంచి బరిలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారేనని, వారు పేదవారికం కష్టాలను అనుభవించిన వారేనన్నారు. 

స్థానికులు ఎలాగో చెప్పాలి 
గద్వాల నుంచి వలస వచ్చి తాడిపత్రి ప్రాంతానికి చేరుకున్న వారు లోకల్‌ ఎలా అవుతారనే విషయాన్ని అందరూ గమనించాలన్నారు. బడుగు బలహీనవర్గాలకు చెందిన వారు అయినందుకు ఇలాంటి నీచమైన రాజకీయాలను చేస్తున్నారు తప్ప వేరేది కాదన్నారు. బోయ, కురుబ, ముస్లిం సామాజిక వర్గాలకు ఒక న్యాయం... కమ్మ వారికి మరో న్యాయంగా నీచ రాజకీయాలను చేయాలను కోవడం దారుణమన్నారు.   

మరిన్ని వార్తలు