పవన్‌కల్యాణ్‌ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి

13 Sep, 2016 00:55 IST|Sakshi
  • బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉంగరాల చినబాబు
  • బోట్‌క్లబ్‌ (కాకినాడ) : 
    కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుపై చేసిన విమర్శలకు జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉంగరాల వెంకటరమణ (చినబాబు) డిమాండ్‌ చేశారు. కాకినాడలో సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఏపీకి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై ఎలాంటి అవగాహన లేకుండా బీజేపీ ప్రభుత్వంపైన, వెంకయ్యనాయుడుపైన కాకినాడ సభలో చేసిన విమర్శలు ఏమాత్రం సమంజసం కాదన్నారు. విభజన చట్టంలో లేని పోలవరం ముంపు మండలాలను మొదటి క్యాబినెట్‌లో సమావేశంలో చర్చించి ఆర్డినెన్స్‌ ద్వారా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించి, భారతీయ జనతాపార్టీ తన చిత్తశుద్ధిని నిరూపించుకుందన్నారు. నిరంతర విద్యుత్‌ సరఫరా పథకానికి దేశంలో మూడు రాష్ట్రాలను ఎంపిక చేయగా, అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్‌ అని ఆయన తెలిపారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పిఠాపురం–కాకినాడ మెయిన్‌లైన్‌ కోసం రూ.50 కోట్లను, కోటిపల్లి–నర్సాపురం మధ్య గోదావరి, దాని ఉపనదులపై మూడు బ్రిడ్జిల కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించిందన్నారు. విభజన బిల్లులో ఉన్న హామీల నిమిత్తం వెంకయ్యనాయుడు 35 మంది మంత్రులతో చర్చించి, ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు వివిధ పరిశ్రమలు, విద్యాసంస్థల కేటాయించడమే కాకుండా వాటిని తక్షణమే అద్దె భవనాలలో నిర్వహించేటట్టు చేశారన్నారు. ఆయనను పవన్‌కల్యాణ్‌ విమర్శించడం తగదన్నారు. ఏపీని ఆదుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ప్యాకేజీ ఇచ్చిందన్నారు. 
     
మరిన్ని వార్తలు