ఎంత రాసినా సున్నా మార్కులే!

1 Jun, 2017 23:32 IST|Sakshi
ఎంత రాసినా సున్నా మార్కులే!

- ఎస్కేయూ డిగ్రీ ఫైనలియర్‌ ఫలితాల్లో వైచిత్రి
- మొదటి, రెండో సంవత్సరంలో 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత
- అయినా ఫైనలియర్‌లో సున్నా మార్కులే
- మూల్యాంకనం తీరుపై విద్యార్థుల విస్మయం
- రెక్టార్‌ పర్యవేక్షణలో పునఃపరిశీలన


ఎస్కేయూ : - అనంతపురం నగరానికి చెందిన రామాంజినేయులు ఎస్కేయూకు అనుబంధంగా ఉన్న ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చదివాడు. బీఎస్సీ మొదటి సంవత్సరంలో 69 శాతం, రెండో ఏడాది 72శాతం మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. ఫైనలియర్‌లో మాత్రం స్టాటిస్టిక్స్‌లో కేవలం రెండు మార్కులు వచ్చాయి. పరీక్ష బాగా రాశానని, కావాలంటే జవాబుపత్రం చూడాలని అతను అంటున్నాడు.

- ఇదే కళాశాలలో చదివిన బి.ఆంజనేయులు (బీఎస్సీ - స్టాటిస్టిక్స్‌)  మొదటి, రెండో సంవత్సరం 69 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. ఫైనలియర్‌లో మాత్రం మూడు సబ్జెక్టులు ఫెయిలయ్యాడు. స్టాటిస్టిక్స్‌లో ఏడు మార్కులే వచ్చాయి. ఇతనికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. ఫైనలియర్‌లో ఫెయిల్‌ కావడంతో ఉద్యోగం చేజారే ప్రమాదముంది. రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేస్తే ఫలితాలు ప్రకటించడానికి రెండు నెలలు పడుతుంది. తాను పరీక్ష బాగా రాసినా ఎందుకిలా జరిగిందో అర్థం కావడం లేదంటూ ఆంజనేయులు వాపోతున్నాడు. వీరిద్దరే కాదు.. జిల్లా వ్యాప్తంగా చాలామంది విద్యార్థులకు ఇదే పరిస్థితి ఎదురైంది.

           డిగ్రీ ఫైనలియర్‌ ఫలితాల్లో సింహభాగం విద్యార్థులకు సున్నా మార్కులు రావడం విస్మయం కలిగిస్తోంది. మూల్యాంకనంలో తప్పిదాలు జరిగాయా? లేక కంప్యూటర్‌లో మార్కుల నమోదు సందర్భంగా పొరపాట్లు చేశారా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. గత రెండేళ్లుగా ఎస్కేయూ పరీక్షల విభాగం పనితీరుపై విమర్శలొస్తున్నాయి. గత ఏడాది ఇంటర్నల్‌ మార్కుల నమోదులో తప్పిదాలు జరగడంతో వేలాది మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. దీంతో ఆ తప్పిదాలను సవరించారు. మరోవైపు ఉత్తీర్ణత బాగా తగ్గడంతో గతేడాది 15 మార్కులు అందరికీ అదనంగా కలిపి (గ్రేస్‌ మార్కులు)  ఫలితాలు ప్రకటించారు.  

సిలబస్‌లో లేని ప్రశ్నలతో తంటా
     2015–16 విద్యా సంవత్సరం నుంచి ఎస్కేయూ డిగ్రీ కోర్సుల్లో సెమిస్టర్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. అప్పటికే ద్వితీయ, తృతీయ సంవత్సరాల్లో ఉన్న విద్యార్థులకు మాత్రం పాత పద్ధతి (వార్షిక పరీక్షలు)లోనే పరీక్షలు నిర్వహించారు. నూతన విద్యా సంవత్సరం (2017-18) నుంచి పాతపద్ధతికి పూర్తిగా స్వస్తి చెప్పనున్నారు. ఇకమీదట పరీక్షలన్నీ సెమిస్టర్‌ విధానంలోనే ఉంటాయి. ఇకపోతే ఈసారి పాతపద్ధతిలో ఫైనలియర్‌ పరీక్షలు రాసిన విద్యార్థులకు ప్రశ్నలు కఠినంగా ఇవ్వటంతో పాటు సిలబస్‌లో లేని వాటినీ ఇచ్చారు. దీనివల్ల మార్కులు తగ్గాయని విద్యార్థులు వాపోతున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఫలితాలు సవరించాలనే డిమాండ్లు అధికమవుతున్నాయి. దీంతో  రెక్టార్‌ ప్రొఫెసర్‌ హెచ్‌.లజిపతిరాయ్‌ పర్యవేక్షణలో ఫలితాలను పునఃపరిశీలిస్తున్నారు. ఏయే సబ్జెక్టులు సమస్యాత్మకంగా ఉన్నాయో.. ఆయా బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్లను సంప్రదించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

మూల్యాంకనంలో ఎలాంటి తప్పిదాలూ లేవు
        మూల్యాంకనంలో ఎలాంటి తప్పిదాలకూ అవకాశం లేదు. ఎవరైనా రీవాల్యుయేషన్, రీ కౌంటింగ్, పర్సనల్‌ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎగ్జామినర్‌ వేసిన మార్కులు తప్పుగా నిర్ధారణ అయితే తక్షణ చర్యలు తీసుకుంటాం. విద్యార్థికి న్యాయం చేస్తాం. ఇప్పటి వరకు వచ్చిన పర్సనల్‌ వెరిఫికేషన్‌లో ఎలాంటి తప్పిదాలూ కనపడలేదు.
–ప్రొఫెసర్‌ జె.శ్రీరాములు, డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్స్, ఎస్కేయూ
 
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
ఎస్కేయూ : డిగ్రీ ఫైనలియర్‌ ఫలితాల్లో తప్పిదాలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నాయకులు  గురువారం ఎస్కేయూ పరీక్షల విభాగాన్ని ముట్టడించారు. అక్కడే బైఠాయించి ఆందోళన చేపట్టారు. డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్స్‌ ప్రొఫెసర్‌ జె.శ్రీరాములుతో వాగ్వాదానికి దిగారు. ఫస్టియర్‌, సెకండియర్‌లో గణనీయమైన మార్కులు సాధించిన విద్యార్థులకు కూడా ఫైనలియర్‌లో సున్నా మార్కులు రావడం ఏమిటని  ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు కొండన్న నిలదీశారు. అనంతరం రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కె.సుధాకర్‌ బాబు ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు. మార్కులు తక్కువ వచ్చిన వారి వివరాలు ఇవ్వాలని, జవాబు పత్రాలను పరిశీలించి  న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ ఎస్కేయూ శాఖ అధ్యక్షుడు ముస్తఫా, జిల్లా సెక్రటరీ రమేష్, నాయకులు సూర్య చంద్ర, డీవైఎఫ్‌ఐ నాయకుడు ఆంజినేయులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు