రెండో విడత.. 10,355 చెరువులు!

3 Nov, 2015 01:00 IST|Sakshi

♦ ‘మిషన్ కాకతీయ’లో {పభుత్వ లక్ష్యం ఇదీ
♦ రూ.2,083 కోట్ల ఖర్చు.. జనవరిలోనే పనులు ప్రారంభం
 
 సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ రెండో విడతలో భాగంగా ఈ ఏడాది 10,355 చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు రూ.2,083 కోట్ల మేర ఖర్చు చేయనుంది. ఈ పనులను ఎప్పట్లోగా పూర్తి చేయాలన్న దానిపై స్పష్టమైన ప్రణాళిక రూపొందించింది. మొదటి విడతలో మిగిలిన పనులను మార్చి 31 నాటికి వంద శాతం పూర్తి చేయాలని నిర్ణయించింది. మొదటి విడతలో భాగంగా చేపట్టిన మిషన్‌లో మొత్తంగా 9,586 చెరువుల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకోగా.. 8,817 మాత్రమే పనులు చేపట్టారు. మిగతా 769 పనులను రెండో విడతతో కలిపి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది.

తొలి విడతలో చేసిన పనుల్లో చెరువుల పూడిక తీత పనులు ముగిసినా.. కాలువల మరమ్మత్తులు, వియర్‌ల నిర్మాణం తదితర పనులు ఇంకా చేయాల్సి ఉంది. అధికారుల లెక్కల ప్రకారం మొత్తంగా రూ.2,200 కోట్ల పనుల్లో రూ.607 కోట్ల విలువైన పనులు పూర్తయ్యా యి. ఇందులో రూ.505 కోట్ల మేర బిల్లులు సమర్పించగా.. రూ.475 కోట్ల చెల్లింపులు పూర్తయ్యాయి. మరో రూ.1,600 కోట్ల పనులు చేయాల్సి ఉంది. వర్షాకాల సీజన్ ముగిసినందున ఈ పనులను మార్చి నాటికి వంద శాతం పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం కాంట్రాక్టర్లు, అధికారులకు నిర్దేశించింది.

 జనవరి కల్లా పనులు షురూ: లక్ష్యాలను చేరుకునేందుకు ఏయే పనులు ఎప్పట్లోగా పూర్తి చేయాలన్నది చీఫ్ ఇంజనీర్ నాగేంద్రరావు జిల్లాల అధికారులకు వివరించారు. జనవరి 7 నాటికి 40  పనులు, మిగతా 60% పను లు జనవరి 22 నాటికి ప్రారంభం కావాలని నిర్ణయించారు. సరిహద్దులను ఇప్పటి వరకు 3,808 చెరువులకు మాత్రమే గుర్తించగా... మిగతావాటికి మార్చి నాటికి పూర్తి చేయాలని సూచించారు. పనుల సత్వర పూర్తి, అంచనాల తయారీ, సాంకేతిక అనుమతుల విషయంలో గతంలో మాదిరే ఈసారి 150 మంది రిటైర్డ్ ఇంజనీర్ల సాయం తీసుకోవాలని చిన్ననీటి పారుదల శాఖ నిర్ణయించింది.

 చెరువుల కింద పెరిగిన భూగర్భ జలాలు
 మిషన్ కాకతీయ పనులు చేపట్టిన చెరువుల కింద గణనీయంగా భూగర్భ జలాలు పెరిగి నట్లు భూగర్భ జల విభాగం తేల్చింది. ఆదిలాబాద్ జిల్లా దిల్‌వార్‌పూర్‌లో 2.8, మెదక్ జిల్లా సిద్ధిపేటలో 0.02, కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో 0.69, వరంగల్ జిల్లా రఘునాథపల్లిలో గరిష్టంగా 6.37, ఖమ్మం జిల్లా సుబ్లేడులో 2.42, నల్లగొండ జిల్లాలోని బి.వెల్లంల చెరువుల కింద 3.08 శాతం మేర భూగర్భ జలాలు పెరిగినట్లు తెలిపింది. నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షాలు లేని కారణంగా భూగర్భ జలాలు ఆశించిన స్థాయిలో లేదని శాఖ నివేదిక పేర్కొంది.

>
మరిన్ని వార్తలు