రక్తసిక్తం

24 Jul, 2016 23:22 IST|Sakshi
రక్తసిక్తం

జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం చెందగా, ఎనిమిది మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఆ జ్ఞాపకాల నుంచి ఇంకా బయటపడకనే మరోసారి జిల్లాలోని రహదారులు రక్తసిక్త మయ్యాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో నలుగురు అకాల మృత్యువాతపడ్డారు. అదృష్టవశాత్తు మరో నలుగురు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు.

యాడికి: యాడికి మండలం చందన– రాయలచెరువు మార్గంలో ఆదివారం రాత్రి 9 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం నల్లమేకపల్లికి చెందిన జనార్దన్‌రెడ్డి(26), ప్రసాద్‌(23) దుర్మరణం చెందారు. వారిద్దరూ బైక్‌లో స్వగ్రామం నుంచి రాయలచెరువుకు బయలుదేరగా మార్గమధ్యంలో చందన గ్రామ సమీపానికి రాగానే గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొనడంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే 108లో రాయలచెరువుకు, అక్కడి నుంచి గుత్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఇద్దరూ మృతి చెందినట్లు స్థానికులు, పోలీసులు తెలిపారు. జనార్దన్‌రెడ్డికి మూడ్రోజుల కిందట కుమారుడు పుట్టాడని తెలిసింది. తమ తల్లిదండ్రులకు ప్రసాద్‌ ఒక్కడే కుమారుడు కావడం గమనార్హం.

పామిడి సమీపంలో మరొకరు..
పామిడి: పామిడి సమీపంలోని జాతీయ రహదారిపై ఖాల్సా డాబా క్రాస్‌ వద్ద సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో  స్థానిక అంబేడ్కర్‌ కాలనీవాసి దళిత వడిపోగుల సుంకన్న(30) మృతి చెందాడు.   స్థానిక దుర్గమ్మవీధివాసులు సునీల్‌కుమార్, రాజశేఖర్‌ తీవ్ర గాయాల పాలయ్యారు.  సుంకన్న తన మిత్రులు సునీల్‌కుమార్, రాజశేఖర్‌తో కలసి బైక్‌పై స్థానిక అనిమిరెడ్డి ఫ్యాక్టరీ వద్దగల డాబాకు వచ్చారు. అనంతరం కంకర మిషన్‌ ఫ్యాక్టరీలో తనకు రావాల్సిన డబ్బు కోసం సుంకన్న ఇద్దరితో కలిసి  అదే బైక్‌లో ద్విచ నీలూరు వైపు బయలుదేరాడు. వేగంగా వెళ్తున్న వారి వాహనం అదుపుతప్పి డివైడర్‌కు ఢీ కొన్నట్లు సమాచారం.

 

ప్రమాదంలో సుంకన్న ఎగిరి డివైడర్‌ మధ్య ఉన్న ఇనుప కంచెపై పడ్డాడు. దీంతో తల, ముఖం, ఛాతీ ఛిద్రమై గుర్తుపట్టలేని స్థితిలో అక్కడికక్కడే మృతి చెందాడు.  సునీల్‌కుమార్, రాజశేఖర్‌  తలలు పగిలి తీవ్ర గాయాలపాలై స్పృహ కోల్పోయారు. వారిని   అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు.  పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం వారిని కర్నూలుకు తరలించినట్లు సమాచారం. కాగా బైక్‌ను  ఆర్టీసీ బస్సు ఢీ కొందని కొందరు,   ఐచర్‌ వాహనం ఢీ కొన్నట్లు మరికొందరు చెబుతున్నారు. ఈ విషయమై పోలీసులు కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.  సీఐ నరేంద్రరెడ్డి, ఎస్‌ఐ రవిశంకర్‌రెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గుత్తికి తరలించారు.  

మృతుడు సుంకప్ప నీలూరు రోడ్డులోని లక్ష్మీ వెంకటేశ్వర స్టోన్‌ క్రషి్షంగ్‌ మిషన్‌  ఫ్యాక్టరీలో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. నీలూరు గ్రామవాసి అయిన అతను భార్య సునీత,  చిన్నారులు దుర్గాలక్ష్మి, అభికుమార్‌తో కలిసి పామిడిలో ఉంటున్నాడు. సునీత మొదటి భర్త పొలంలో ట్రాక్టర్‌తో పనిచేస్తూ వాహనం బోల్తాపడి బురదలో కూరుకుపోయి మృతి చెందాడు. అనంతరం ఈమెను సంకన్న వివాహం చేసుకున్నాడు. ఈయన కూడా ప్రమాదంలో మృతి చెందడంపై ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. నాయనా! అప్పుడే నీకు నూరేళ్లు నిండెనా!! దేవుడా ఎంతపని చేశావు.. భర్తను కోల్పోయిన అమ్మాయికి జీవితం ఇవ్వాలని పెళ్లి చేసుకున్నావే.. నీవు కూడా పోతివా.. అని మృతుడి తల్లి బాలనాగమ్మ, అక్క సుంకురత్నమ్మ విలపించిన తీరు అందరినీ కంటతడిపెట్టించింది.

మరిన్ని వార్తలు