10 వేలమంది భక్తులతో దివ్యదర్శనం

7 Sep, 2016 23:33 IST|Sakshi
10 వేలమంది భక్తులతో దివ్యదర్శనం
13 జిల్లాల్లో ప్రముఖ ఆలయాలకు ఉచిత యాత్ర   ∙ 
దేవాదాయశాఖ ఆర్‌జేసీ చంద్రశేఖర్‌ ఆజాద్‌
అయినవిల్లి : జిల్లా నుంచి ఒకేసారి 10వేల మంది భక్తులు రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని ప్రముఖ దేవాలయాలను ఉచితంగా దర్శించేందుకు ‘దివ్యదర్శనం’ ప్రాజెక్టు పేరిట ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయశాఖ ఆర్‌జేసీ ఎస్‌ఎస్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ చెప్పారు. తద్వారా హిందూ ధర్మం ఉన్నతికి కృషి చేస్తున్నామన్నారు. బుధవారం ఆయన అయినవిల్లి విఘ్నేశ్వరస్వామివారి ఆలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్వామి అన్నదాన సత్రం నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్నప్రసాదాల తయారీకి వంట చెరకుకు బదులు ఎల్‌పీ గ్యాస్‌ వినియోగించాలని ఈఓ ఎం.సత్యనారాయణరాజును ఆదేశించారు. ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. స్వామివారి ప్రసాదాలను రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ‘దివ్య దర్శనం’ ప్రాజెక్టును అక్టోబర్‌ మొదటి వారం నుంచి ప్రారంభించనున్నామన్నారు. ఈ యాత్ర ఐదురోజులు పాటు ఉంటుందని, యాత్రలో పాల్గొనే భక్తులకు ఉచితంగా అన్ని సదుపాయాలనూ కల్పిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. అయినవిల్లి, అప్పనపల్లి ఆలయాల విశిష్టతను రాష్ట్ర ప్రజలకు తెలిపేందుకు  రథయాత్రలు ప్రారంభిస్తామని, ఇందుకోసం ప్రత్యేక రథాలను తయారు  చేయిస్తామని చెప్పారు. అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయాన్ని నాలుగు వైపులా విస్తరించేందుకు బృహత్తర ప్రణాళిక సిద్ధం చేశామని, అందులో భాగంగానే ఆలయాభివృద్ధికి 4.50 ఎకరాల భూమిని కొనేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.
 
మరిన్ని వార్తలు