రూ.100 కోట్ల కోఢీ!

8 Jan, 2016 12:30 IST|Sakshi
రూ.100 కోట్ల కోఢీ!

కోడిపందేల నిర్వహణపై ఉక్కుపాదం మోపుతామంటూ పోలీసులు చేస్తున్న హెచ్చరికలు బేఖాతరు అవుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున పందేలు నిర్వహించేందుకు పశ్చిమగోదావరి జిల్లాలోని పలుప్రాంతాలలో ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. కోడిపందేలతోపాటు యాథావిధిగా గుండాట, పేకాట, కోత ఆటలను కూడా నిర్వహించేందుకు పందెగాళ్లు సిద్ధమవుతున్నారు. మొత్తంగా పందేలలో రూ.100కోట్లు చేతులు మారనున్నాయని అంటున్నారు.    - పాలకొల్లు టౌన్

సిద్ధమవుతున్న బరులు

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రధానంగా ఐ.భీమవరం, వెంప, నిడదవోలు, తాడేపల్లిగూడెం, పూలపల్లి, కలగంపూడి, కొప్పాక ప్రాంతాల్లో జూదాలు నిర్వహిస్తారు. ఇక్కడేగాకుండా అనేక చిన్న గ్రామాల్లో సైతం పందేల నిర్వహణకు బరులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో నిర్వాహకులు రంగం సిద్ధం చేశారు. బరుల్లో కోడి పుంజు సామర్థ్యాన్ని బట్టి రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు ఒక పందెం జరుగుతుంది. వీటితోపాటు పందేలు చూడడడానికి వెళ్లేవారు ఒక్కొక్క పందెంపై రూ.పది లక్షల వరకు పై పందేలు వేస్తుంటారు. కోడిపందేలపై ఆసక్తి ఉన్న ఎన్‌ఆర్‌ఐలు, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు పండగ మూడురోజులు ప్రత్యేక ఏర్పా ట్లు చేసుకుని ఈ ప్రాంతాలకు చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే కోడిపందేల ముసుగులో నిర్వహించే గుండాట, కోత ఆటల్లో సామాన్య, మధ్యతరగతిప్రజలు పెద్ద ఎత్తున పందాలు కాస్తుంటారు. వీళ్లలో నష్టపోయేవారు అధికంగా ఉంటారు.

సుదూర ప్రాంతాల నుంచి పందెం రాయుళ్లు
 

జిల్లాలోని కోడిపందేల బరులకు  హైదరాబాద్, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయవాడ, బెంగళూరు, తమిళనాడు నుంచి అనేకమంది ప్రముఖులు వస్తుంటారు. ఇప్పటికే పండగ మూడురోజులు బస చేయడానికి పందేలు జరిగే ప్రాంతాల్లోని లాడ్జిలు, గెస్ట్‌హౌస్‌లు బుక్ చేసుకున్నట్టు తెలిసింది. ఇది ఇలా ఉండగా పందేలకు కోళ్లను సిద్ధం చేసేవారు జిల్లాలో సుమారు 40 మంది వరకు ఉన్నారని చెబుతున్నారు. వీరు ప్రధానంగా ఢీకొట్టే నెమలి, డేగ, పచ్చకాకి, పింగళి, రసింగ్, కేతువ వంటి పందెం కోళ్లను సిద్ధం చేస్తారు. కోడిపుంజు సామర్థ్యాన్ని బట్టి పందెంగాళ్లు వారి నుంచి కొనుగోలు చేసి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా తయారు చేసిన కోడిపందేల బరుల్లో దింపుతారు.

కుక్కుటశాస్త్రం ప్రకారం కొనుగోళ్లు

పందేల నిర్వాహకులు చాలామంది కుక్కుటశాస్త్రాన్ని అనుసరిస్తారని చెబుతున్నారు. పందెం జరిగే రోజు తిధిని బట్టి ఏ కోడిపుంజు గెలుస్తుందో అంచనా కట్టి రూ.లక్ష ల్లో కొనుగోలు చేసి మరీ పం దేలు కాస్తారని చెబుతున్నారు. జిల్లాలో కోడిపందేల నిర్వాహకులు రూ.లక్షలు ఖర్చుచేసి భారీ టెంట్‌లు, బరులు ఏర్పాటు చేస్తారు. సంప్రదాయంగా వస్తున్న సంక్రాంతి కోడిపందేలు జరగాల్సిందేనని నిర్వాహకులు చెబుతున్నారు. పోలీసులు ఎంత అడ్డుకోవాలని చూసినా జిల్లాలో అన్నిప్రాంతాల్లో సంక్రాంతి 3 రోజులు కోడిపందేలు జరిగి తీరతాయని నిర్వాహకులు ఘంటాపథంగా చెబుతున్నారు.

ఆస్తుల తనఖాకూ సిద్ధం

కోడిపందేల కోసం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఆస్తులను వడ్డీ వ్యాపారులకు తనఖా పెడుతుంటారు. గత ఏడాది యలమంచిలి మండలంలో ఒక వ్యక్తి రూ.లక్షల్లో పందేలు కాసి చివరకు చేతులు కాల్చుకుని తనకున్న ఎకరం పొలాన్ని అమ్మి వడ్డీ వ్యాపారులకు చెల్లించాడు. డెల్టాప్రాంతంలో కోడిపందేల రాయుళ్ల ఆస్తులు తనఖాలు పెట్టుకుని అధిక వడ్డీలకు అప్పులు ఇవ్వడానికి వడ్డీ వ్యాపారులు సిద్ధంగా ఉంటారు. భీమవరం కేంద్రంగా ఈ దందా నడుస్తోందనేది బహిరంగ రహస్యం. కాగా, కోడి పందేల ముసుగులో దొంగనోట్ల చలామణీ కూడా విచ్చలవిడిగా సాగుతుంది.

మరిన్ని వార్తలు