అభి‘వంద’నం

12 Dec, 2016 15:02 IST|Sakshi
అభి‘వంద’నం
అపురూపమవుతున్న రూ.100 నోట్లు
అవసరాలకు ఆలోచించి ఖర్చు చేస్తున్న ప్రజలు
అమలాపురం టౌన్‌ :
‘‘ఎవ్రీ డాగ్‌ హేజ్‌ ఏ డే..’’  ‘‘ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది’’ నిజమే అలాంటి రోజు, అలాంటి టైం రూ.వందనోటుకి వచ్చింది. కొన్ని రోజుల క్రితం వరకు ఈ నోటును ప్రజలు తమ జేబుల్లో, పర్సుల్లో ఉంచుకునేందుకు ఇష్టపడేవారు కాదు. పది వంద నోట్లకు బదులుగా ఒక్క వెయ్యి నోటును సింపుల్‌గా తీసుకువెళ్లేవారు. కానీ పెద్దనోట్లు(రూ.500, వెయ్యి) రద్దుతో వందనోటు తిరిగి వెలుగులోకి వచ్చింది. అందరూ ‘వందే’మాతరం అనాల్సిన పరిస్థితి నెలకొంది. వంద నోట్ల కోసం పడిగాపులు పడాల్సిన సమయం వచ్చింది. ఈనెల ఎనిమిదో తేదీ వరకూ మూడో స్థానంలో ఉన్న వంద నోటు.. పెద్ద నోట్ల రద్దుతో మొదటి స్థానానికి ఎగబాకింది. గతంలో రూ.100 నోటును విచ్చలవిడిగా ఖర్చుచేసిన జనం ప్రస్తుతం అపురూపంగా చూసుకుంటున్నారు. ఖర్చు చేసేందుకు ఆలోచిస్తున్నారు. జేబులో రూ.100 నోట్లు పది ఉంటే చాలు రూ.లక్ష ఉన్నంత అండతో.. ధైర్యంతో ఉంటున్నారు. పెద్ద నోట్లున్న ధనికుడు కంటే.. రూ.వందనోట్లున్న వారే ప్రస్తుతం రారాజుగా చలామణీ అవుతున్నారు.
అత్యవసర ఖర్చులకు వంద నోట్లు
విక్రయాలు, కొనుగోళ్లు అధికంగా ఉండే వ్యాపార దుకాణాల, పెట్రోలు బంకులు తదితర చోట్ల తమకు బాగా తెలుసున్న వ్యక్తులు ఉంటే వారి వద్ద నుంచి రూ.500 నోటు ఇచ్చి ఐదు వంద నోట్లు తీసుకుంటున్నారు.  అలా వంద నోట్లను సేకరించుకుని ముందు జాగ్రత్తగా భద్రపరుచుకుంటున్నారు. జిల్లాలో బ్యాంకులు, ఏటీఎంల నుంచి రూ.రెండు వేల నోట్లే వస్తుండడంతో వంద నోటును ఆలోచించి ఖర్చు చేస్తున్నారు. జిల్లాలోని రాజమహేంద్రవరం, కాకినాడ నగరాలతో పాటు పది పట్టణాల్లో వంద నోట్లకు ఉన్న డిమాండు ఇంతా అంతా కాదు. తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను రూ.వందల నోట్లలోకి మార్చేందుకు రోజులో సగానికి పైగా సమయం అందుకే వెచ్చిస్తున్నారు. అమలాపురంలో ఓ వ్యక్తి తన వద్ద ఉన్న రూ.2000 నోటు మార్చేందుకు పూట సమయం పట్టింది. సామాన్యుడైన అతను ఏటీఎంలో డ్రా చేసుకుని చివరకు అత్యవసరం కాకపోయినా కేవలం చిల్లర కోసం రూ.600 ఖర్చు చేసుకుని అతికష్టంతో చిల్లర సాధించగలిగాడు. 
మరిన్ని వార్తలు