-

బడుల బాగుకు రూ. 100 కోట్లు

17 Jun, 2016 01:50 IST|Sakshi
బడుల బాగుకు రూ. 100 కోట్లు

ప్రతిపాదనలు సిద్ధం చేసిన జడ్పీ
మౌలిక వసతులకు రూ. 64 కోట్లు
అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ. 35 కోట్లు
జిల్లా వ్యాప్తంగా సర్వే పాఠశాలల వారీగా వివరాల సేకరణ
చైర్‌పర్సన్ ఆధ్వర్యంలో సీఎంను కలిసేందుకు నిర్ణయం

 సాక్షి, సంగారెడ్డి: జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం జడ్పీ పాలకవర్గం ప్రభుత్వాన్ని వందకోట్ల మేర నిధులు కోరనుంది. త్వరలో జడ్పీ చైర్‌పర్సన్ రాజమణి మురళీయాదవ్ ఆధ్వర్యంలో సీఈఓ, సభ్యులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిసి నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరనున్నారు. ఇది వరకే నిధుల విషయాన్ని మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో సీఎంను కలిసి నిధులు అంశాన్ని ప్రస్తావిద్దామని జడ్పీ చైర్‌పర్సన్, సీఈఓకు సూచించినట్లు తెలుస్తోంది. జిల్లాలో అత్యధికంగా విద్యార్థులు జిల్లా పరిషత్ హైస్కూల్‌లోనే విద్యను అభ్యసిస్తున్నారు.

జడ్పీ ఉన్నతపాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాల లేవు. ఫలితంగా విద్యార్థులు ఇబ్బందులు పడాల్సివస్తోంది. పాఠశాలల ప్రారంభానికి ముందే మండలాల్లో సర్వే నిర్వహించి జిల్లా పరిషత్ పాఠశాలల్లో సమస్యలకు, అవసరాలకు సంబంధించి వివరాలను సేకరించారు. జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలల్లో 596 అదనపు గదులు అవసరం. రాజీవ్ విద్యామిషన్ ద్వారా అదనపు గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. గదుల నిర్మాణానికి సుమారు రూ.35.76 కోట్ల నిధులు అవసరం అవుతాయని అంచనా. అలాగే మౌలిక సదుపాయాల కల్పన కోసం మరో రూ.64.15 కోట్ల నిధులు అవసరం కానున్నాయి.

 అదనపు గదుల నిర్మాణం
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో చాలాచోట్ల విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు లేవు. విద్యార్థులు చెట్లకింద చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదనపు తరగతి గదుల నిర్మాణానికి సంబంధించి జడ్పీ యంత్రాంగం వివరాలు సేకరించింది. జిల్లాలో  596 జడ్పీ ఉన్నతపాఠశాలల్లో అదనపు తరగతి గదులు అవసరం ఉంది. నియోజకవర్గాల వారీగా అందోలులో 95, దుబ్బాకలో 12, మెదక్‌లో 51, నర్సాపూర్‌లో 139, సంగారెడ్డిలో 48, పటాన్‌చెరులో 30, జహీరాబాద్‌లో 22, సిద్దిపేటలో 21, గజ్వేల్‌లో 63, నారాయణఖేడ్‌లో 115 అదనపు తరగతి గదులు నిర్మించాల్సి ఉంది. వీటి నిర్మాణానికి రూ.35.76 కోట్లు అవసరమని అంచనా.

 మౌలిక వసతులకు రూ.64.15 కోట్లు
జిల్లాలోని 482 జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.64.15 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రహరీల నిర్మాణానికి రూ.19.03 కోట్లు, తరగతి గదుల మరమ్మతు పనులకు రూ.16.28 కోట్లు, కిటీకీలు, తలుపుల మరమ్మతుకు రూ.2.13 కోట్ల, కిచెన్‌షెడ్ నిర్మాణం పనులకు రూ.2.98 కోట్లు, బాలురు, బాలికల మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.8.11 కోట్లు నిధులు అవసరం అవుతాయని అధికారులు నిర్ణయించారు. అలాగే ఫర్నిచర్‌కు రూ.5.02 కోట్లు, బోర్ల తవ్వకం, కంప్యూటర్ల ఏర్పాటుకు రూ.2.56 కోట్లు, పాఠశాలల రంగులు వేయటానికి 5.43 కోట్లు, ఆయా పనులకు చేపట్టేందుకు పన్నులు ఇతర పద్దుల్లో డబ్బుల చెల్లించేందుకు రూ.2.57 కోట్లు నిధులు అవసరం కానున్నాయి. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసిన జెడ్పీ అధికారులు త్వరలో ప్రభుత్వాన్ని నిధులు కోరనున్నారు.

మరిన్ని వార్తలు