12 మంది రైతుల ఆత్మహత్య

29 Oct, 2015 04:29 IST|Sakshi
12 మంది రైతుల ఆత్మహత్య

♦ రంగారెడ్డి జిల్లాలో యువరైతు..
♦ ఎండిన పంటలు, అప్పులే కారణం
 
 సాక్షి నెట్‌వర్క్: తెలంగాణ జిల్లాల్లో రైతు ఆత్మహత్యలు ఆగడం లేదు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు వేర్వేరు జిల్లాల్లో 11 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు ఈ నెల 20న ఆత్మహత్యాయత్నం చేసుకోగా, బుధవారం మరణించాడు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం దూదిగాం శివారు జాతీయ రహదారి పక్కన ఓ రైతు ఉరి వేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా లక్ష్మణచందా మండలం బొప్పారం గ్రామానికి చెందిన రైతు దాసరి రాజేందర్(రాజేందర్‌రెడ్డి)(50) తనకున్న మూడెకరాల్లో వరి చేస్తున్నాడు. పం టకు నీరందక ఎండిపోయింది. మనస్తాపానికి గురై మంగళవారం రాత్రి ఇంటి నుంచి బయలుదేరిన రాజేందర్ గురువారం ఉదయం ఉరివేసుకుని చెట్టుకు వేలాడుతూ కనిపించాడు.

నిజామాబాద్ జిల్లా  బోధన్ మండలం ఖండ్గాం గ్రామానికి చెందిన  రైతు లక్ష్మణ్‌రావ్ (40) తనకున్న ఐదు ఎకరాలతో పాటు మరో నాలుగున్నర ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి, సోయా, పొగాకు వేశాడు. ఆరు ఎకరాల్లో సాగు చేసిన పత్తిని రక్షించుకునేందుకు రెండు బోర్లు వేయగా, నీరు పడలేదు. ఇందుకోసం రూ. మూడు లక్షల వరకు అప్పులు అయ్యాయి. మనస్తాపం చెంది బుధవారం ఉరి వేసుకున్నాడు. ఇదే జిల్లా బోర్గాం(పి) గ్రామానికి చెందిన రైతు సోమర్తి చిన్న మల్లయ్య (58) ఐదు ఎకరాల్లో వరి వేశాడు. పంట మొత్తం ఎండిపోయింది. మొత్తం రూ. 5 లక్షలు అప్పు అయ్యింది. 

మూడు బోర్లు వేయగా, ఫెయిల్ కావటంతో కుంగి పోయాడు. ఈ నెల 25 న ఇంటి నుంచి వెళ్లిన మల్లయ్య బుధవారం గ్రామ శివారులో ఉరి వేసుకుని కనిపించాడు. సిరికొండ మండలంలోని ఒన్నాజీపేట్ గ్రామానికి చెందిన రైతు గోగు లింబారెడ్డి(40) ఈ నెల 20న పొలం వద్ద గుళికల మందు తాగాడు. హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించగా అక్కడ బుధవారం చనిపోయాడు.  అతడికి రూ. 5 లక్షల వరకు అప్పు ఉంది. కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌నకు చెందిన కౌలు రైతు గొట్టె లచ్చయ్య(40) రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్నాడు. పెట్టుబడుల కోసం రూ. 60 వేల వరకు అప్పు చేశాడు.  

దిగుబడి సరిగా రాలేదు. దీంతో అప్పులు ఎలా తీర్చాలని మనస్తాపం చెంది ఉరేసుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా గట్టు ఇందువాసి గ్రామానికి చెందిన రైతు కంది తిమ్మప్ప(45) తనకున్న రెండు ఎకరాల్లో పత్తి వేశాడు. రెండు లక్షల అప్పు చేసి రెండు బోర్లు వేసినా నీళ్లు పడలేదు. మరోవైపు పంట ఎండిపోవడంతో పొలం వద్ద ఉరి వేసుకున్నాడు. వంగూరు మండల అన్నారం తండాకు చెందిన రైతు కోటేశ్వర్‌నాయక్(45) వ్యవసాయంలో నష్టాలు రావడం.. పిల్లల చదువులు, కుటుంబ పోషణ కోసం అప్పులు అయ్యియి. అప్పు తీరేమార్గం కనిపించక మంగళవారంరాత్రి క్రిమిసంహారక మందు తాగాడు. నల్లగొండ జిల్లా గుండాల మండలం బండకొత్తపల్లికి చెందిన రైతు కావటి మల్లయ్య (37) తనకున్న మూడెకరాల్లో మూడు బోర్లు వేశాడు.

రూ.మూడు లక్షల వరకు అప్పుచేసి పైప్‌లైన్ కూడా వేసుకున్నాడు. మూడెకరాల్లో సాగు చేసిన నువ్వుల చేనుకు నీటి వసతి అంతగా లేకపోవడంతో దిగుబడి తగ్గింది. మనస్తాపానికి గురైన మల్లయ్య క్రిమిసంహార మందు తాగాడు. వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం ఇరవెన్నుకు చెందిన తొడుసు రమేశ్(40)  ఆరు  ఎకరాల్లో మొక్కజొన్న, పత్తి వేశాడు.  పెట్టుబడి కోసం రూ.2 లక్షలు అప్పు చేశాడు. అరుుతే వర్షాభావంతో ఆశించిన దిగుబడి రాలేదు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన రమేష్ బుధవారంక్రిమిసంహారక మందు తాగాడు.

రాయపర్తి మండలం కొండాపురం గ్రామానికి చెందిన రైతు కనుకుంట్ల రాములు(55)కు ఐదెకరాల భూమి ఉండగా, మూడెకరాల్లో పత్తి, ఎకరంలో వరి, మరో ఎకరంలో పసుపు సాగు చేశాడు. పత్తికి పురుగుపట్టడం, వరి ఎండిపోవడంతో పెట్టుబడి కోసం తెచ్చిన రూ.1.50 లక్షల అప్పు ఎలా తీర్చాలోననే మనస్తాపంతో బుధవారం క్రిమిసంహారక మందు తాగాడు. మంగపేట మండలం చెంచుపల్లికి చెంది న రైతు వేల్పుల రామయ్య(50)కు గతేడాది వ్యవసాయంలో నష్టం ఏర్పడి అప్పులపాలయ్యాడు.  

వర్షాభావంతో పంటలు ఎండిపోయూరుు. దీంతో అప్పులెలా తీర్చాలోననే మనస్తాపంతో బుధవారం పొలం వద్దనే క్రిమిసంహారక మందు తాగాడు. రం గారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కర్తమేడిపల్లికి చెందిన చంద్రయ్య(25) పెట్టుబడి కోసం రూ. 2 లక్షలు అప్పులు చేశాడు. పంటలు సరిగా పండక అప్పులు తీర్చేమార్గం లేక ఉరేసుకున్నాడు.

మరిన్ని వార్తలు