మగబిడ్డ లేకుండా చేయాలని..

6 May, 2016 20:32 IST|Sakshi
మగబిడ్డ లేకుండా చేయాలని..

నిడదవోలు :  బాలుడ్ని దారుణంగా హత్య చేసి, మరొకనిపై హత్యాయత్నం చేసినన కేసుల్లో నిందితుడు అడపా కోటసత్యనారాయణ ను పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. నిడదవోలు సీఐ కార్యాలయంలో కొవ్వూ రు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు కేసు పూర్వాపరాలను విలేకరులకు వెల్లడించా రు. ఆస్తి లేనందున తనను చిన్నచూపు చూస్తున్నారని, అవహేళన చేస్తున్నారని నిందితుడు అడపా సత్యనారాయణ బంధువులపై కక్ష పెంచుకున్నాడని డీఎస్పీ చెప్పారు. బంధువులకు మగబిడ్డ లేకుండా చేయాలనే దుర్బుద్ధితోనే ప్రణాళిక ప్రకారం అతడు బందుల సాయికిరణ్ (12)ను హతమార్చాడని, మరో వ్యక్తిని చంపబోయాడని వెల్లడించారు.  
 
 ఇలా జరిగింది
 అట్లపాడుకు చెందిన బందుల రామకృష్ణ, వెంకటలక్ష్మి దంపతులకుమారుడు సాయికిరణ్  శెట్టిపేట గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. అదే ఊళ్లో ఉన్న అడపా సత్యనారాయణ ఈ బాలుడికి బాబయ్య వరస. కానీ అతడు అప్పటికే కిరణ్ కుటుంబంపై కత్తికట్టి ఉన్నాడు. 2వ తేదీ ఉదయం అమ్మమ్మ ఇంటి వద్ద ఉన్న సాయి కిరణ్‌ను ముందుగా వేసుకున్న పథకం ప్రకారం అతడు నిడదవోలు వెళ్లి ఎక్వేరియం తీసుకువద్దామని చెప్పి మోటార్‌సైకిల్ ఎక్కించుకున్నాడు. శెట్టిపేట శివారుల్లో సాయికిరణ్‌ను పీక నులిమి, కాలితో మెడను బలంగా అదిమి హత్యచేసి మృతదేహాన్ని వియార్ కాలువ పక్కన ఉన్న గోతిలో పారేసి వెళ్లిపోయాడు.
 
 ఆ తర్వాత శెట్టిపేట వచ్చిన అడపా సత్యనారాయణ తనకు వరసకు మేనల్లుడైన కానురు సత్యనారాయణను కూడా చంపాలనుకున్నాడు. తాటాకులు నరకడానికి రావాలని కోరి అతడిని తన బైక్‌పై పొలానికి తీసుకువెళ్లాడు. బైక్‌ను కానురు సత్యనారాయణకు ఇచ్చి వెనుక కూర్చున్న నిందితుడు వేలివెన్ను రోడ్డులో ఉండగా కొడవలితో దాడి చేసి తలపై నరికాడు. అతడు కింద పడిపోగా తల, చేతులపై పది సార్లు నరికాడు. ఈలోపు అక్కడి కూలీలు కేకలు వేయడంతో పరారయ్యాడు. కొనఊపిరితో ఉన్న కానురు సత్యనారాయణను ఆస్పత్రికి తరలించారు. అతడు ప్రస్తుతం రాజ మండ్రి ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ఈ కేసుల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి కత్తి, మోటార్ సైకిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
 
 హైదరాబాద్‌కు పరారై...
 వేలివెన్ను పుంత మార్గంలో పరారైన అడపా కోటసత్యనారాయణ డి. ముప్పవరం వద్ద కొడవలిని ఒక సంచిలో ఉంచి రోడ్డు పక్కన పారేశాడు. ఆపైన బైక్‌పై సమిశ్రగూడెం పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ వంతెన వద్దకు వెళ్లాడు. అక్కడినుంచి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా పోలీస్ కానిస్టేబుల్‌ను చూసి భయపడి వచ్చేశాడు. అక్కడినుంచి నిడదవోలు ఆస్పత్రి వద్దకు వచ్చాడు. అక్కడ గ్రామస్తులు కనిపించడంతో బస్టాండ్‌కు చేరుకుని అక్కడ బైక్ వదిలి బస్ ఎక్కి  విజయవాడ వెళ్లాడు. ఆపై రైల్లో హైదరాబాద్‌కు పరారయ్యాడు. ఈలోపు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ప్రణాళిక ప్రకారం అతడ్ని మళ్లీ శెట్టిపేట రప్పించి ఇంటివద్దే అరెస్ట్ చేశారు.
 

మరిన్ని వార్తలు