జిల్లాలో 13 ఇండస్ట్రియల్‌ పార్కులు

12 Dec, 2016 14:41 IST|Sakshi
జిల్లాలో 13 ఇండస్ట్రియల్‌ పార్కులు
– ఒక్కో పార్కుకు 50 నుంచి 100 ఎకరాల స్థల సేకరణ
 - ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ గోపీకృష్ణ 
 
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలో 13 ఇండస్ట్రియల్‌ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ గోపీకృష్ణ  తెలిపారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.  జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని.. ఒక్కోదానిలో ఒక్కటి అంటే మొత్తం 14 ఇండస్ట్రీయల్‌ పార్కుల ఏర్పాటు కావాల్సి ఉందన్నారు. ఓర్వకల్లు మండలంలో ఇండస్ట్రీయల్‌ హబ్‌ను ఏర్పాటు చేయనుండడంతో పాణ్యం నియోజకవర్గాన్ని మినహాయించామన్నారు. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్‌ పార్కులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందుకు 50 నుంచి 100 ఎకరాల చొప్పున భూమిని సేకరిస్తున్నామని వివరించారు. జిల్లా పరిశ్రమలశాఖ, మౌలిక వసతుల కల్పన శాఖలు సంయుక్తంగా రెవెన్యూ శాఖతో కలసి అవసరమై భూములను సేకరిస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే ఎమ్మిగనూరు, ఆదోని, బనగానపల్లె, ఆలూరు నియోజకవర్గాల్లో భూములను గుర్తించామని చెప్పారు. మిగతా నియోజకవర్గాల్లో భూముల గుర్తింపు కోసం కసరత్తు సాగుతోందన్నారు. ఇండస్ట్రియల్‌ పార్కు కోసం కేటాయించిన భూముల్లో మౌలిక వసతుల కల్పన బాధ్యతను ఆంధ్రప్రదేశ్‌ మౌలిక వసతుల కల్పన సంస్థకు అప్పగిస్తున్నట్లు తెలిపారు.  
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటు..
యంత్రాలపై రూ.25 లక్షల వరకు పెట్టుబడి పెడితే సూక్ష్మ పరిశ్రమగా,  5 కోట్ల వరకు పెట్టుబడి ఉంటే చిన్న పరిశ్రమగా, రూ.5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు పెట్టుబడి పెడితే మధ్య తరహా పరిశ్రమగా భావిస్తామని గోపీకృష్ణ  తెలిపారు. ఇండస్ట్రియల్‌ పార్కుల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వివరించారు. ఇండస్ట్రియల్‌ పార్కులు ఏర్పాటయితే..స్థానికంగానే నిరుద్యోగులకు ఉపాధి లభించడంతపాటు రెండెంకల అభివృద్ధిని సాధించేందుకు వీలవుతుందన్నారు.
మరిన్ని వార్తలు