బడ్జెట్‌లో రూ.1,500 కోట్లు కేటాయించాలి

21 Apr, 2017 21:48 IST|Sakshi
బడ్జెట్‌లో రూ.1,500 కోట్లు కేటాయించాలి
రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య నేతల డిమాండ్‌
అమలాపురం టౌన్‌ : ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు బ్రాహ్మణుల సంక్షేమానికి ఏటా రూ.100 కోట్లు వంతున అయిదేళ్లలో రూ.500 కోట్లు కేటాయిస్తానని చెప్పి అధికారం చేపట్టాక మూడేళ్లలో రూ.185 కోట్లే కేటాయించారని రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు జ్వాలాపురం శ్రీకాంత్‌ (అనంతపురం జిల్లా), రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్‌శర్మ (గుంటూరు జిల్లా) తెలిపారు. మిగిలిన రెండేళ్లలో రూ.315 కోట్లు కేటాయించటం సాధ్యం కాదేమోనన్న సందేహం ‍వ్యక్తం చేశారు. వారు అమలాపురంలోని రాష్ట్ర సంఘం కార్యవర్గ సభ్యుడు మాచిరాజు రవికుమార్‌ స్వగృహంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. బ్రాహ్మణుల సంక్షేమానికి ఇక నుంచి ఏ ప్రభుత్వమైనా బడ్జెట్‌లో రూ.1,500 కోట్లు కేటాయించాలని... ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో బ్రాహ్మణులు 50 వేల మందికి పైగా ఉన్నారని...2019 ఎన్నికల్లో రాష్ట్రంలో బ్రాహ్మణులకు ఒక ఎంపీ, అయిదు అసెంబ్లీ, రెండు ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ ప్రధాన రాజకీయ పార్టీ ఆ దామాషాలో బ్రాహ్మణులకు టిక్కెట్లు ఇస్తుందో ఆ పార్టీకే మద్దతిస్తారని చెప్పారు. 
అర్చక వ్యవస్థను పటిష్టం చేసింది వైఎస్సే
వంశపారంపర్య అర్చక వ్యవస్థకు భరోసా ఇచ్చింది...పటిష్టం చేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డేనని రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్‌ అన్నారు. టీడీపీ ప్రభుత్వం మిరాశీ వ్యవస్థను రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసిందని, రద్దు చేస్తే ఉద్యమబాట పడతామని హెచ్చరించారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు అనుబంధంగా నడుస్తున్న జిల్లా కో ఆర్డినేట్‌ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కో ఆర్డినేటర్‌కు కార్పొరేషన్‌ నెలకు రూ.50 వేల వరకూ ఖర్చు చేస్తోందని..ఆ డబ్బును పేద బ్రాహ్మణుల సంక్షేమానికి వెచ్చించాలని సూచించారు. నియోజకవర్గ స్థాయి కో ఆర్డినేటర్ల వ్యవస్థ ఉండగా జిల్లా కో ఆర్డినేటర్‌ అనవసరమన్నారు. సమాఖ్య నాయకులు వైవీ జగన్నాథరావు, మాచిరాజు రవికుమార్, మంగళంపల్లి అంజిబాబు, ఎం.ఎల్‌.ఎన్‌.సురేష్‌బాబు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు