ఇంటి బాట

8 Nov, 2016 02:24 IST|Sakshi
ఇంటి బాట
  •  డీఆర్‌డీఏలో 151 మంది ఉద్యోగుల తొలగింపు
  •  బడ్జెట్‌ ఉన్నా 8 నెలల వేతనాలు ఇవ్వని వైనం
  •  అడిగితే వర్మీకంపోస్ట్‌తో ముడి
  •  లబోదిబోమంటున్న ఉద్యోగులు
  • ‘జాబు రావాలంటే బాబు రావాలి..’ ఇది ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నేతలు ఊరూరా చేసిన నినాదం. బాబొచ్చారు.. మరి జాబులొచ్చాయా అంటే అలాంటిదేమీ లేదు. ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతున్నాయి. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ(డీఆర్‌డీఏ)లో తొమ్మిదేళ్లుగా పని చేస్తున్న ఉద్యోగులను తొలగించడంతో వారు లబోదిబోమంటున్నారు.

     

    అనంతపురం టౌన్‌ : గ్రామీణాభివృద్ధి శాఖలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ఆధ్వర్యంలో ప్రజల భాగస్వామ్యంతో సుస్థిర వ్యవసాయం (సీఎంఎస్‌ఏ) కార్యక్రమం నడుస్తోంది. రైతులందరినీ ఒకటి చేసి విత్తనశుద్ధి, చీడపీడల నివారణ, కషాయాల తయారీ, సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు క్లస్టర్‌ యాక్టివిస్ట్‌ (సీఏ), విలేజ్‌ యాక్టివిస్ట్‌ (వీఏ)లను నియమించారు. గతంలో మొత్తం 191 క్లస్టర్లు ఉండేవి. పది క్లస్టర్లు  వ్యవసాయశాఖ ఆధీనంలోకి వెళ్లాయి. మిగిలిన వాటిలో ప్రస్తుతం 151 క్లస్టర్లలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఒక్కో క్లస్టర్‌కు ఒక్కో సీఏ చొప్పున 2007 నుంచి పని చేస్తుండేవారు. వీరికి గౌరవ వేతనం కింద రూ.4 వేల చొప్పున ఇస్తుండేవారు.

    పథకం ఎత్తివేత

    ఇన్నాళ్లూ సాఫీగా సాగిన సీఎంఎస్‌ఏ కార్యక్రమాన్ని టీడీపీ ప్రభుత్వం ఎత్తివేసింది. వ్యవసాయ శాఖ కూడా ఇవే కార్యకలాపాలను కొనసాగిస్తోందన్న కారణాన్ని చూపుతూ గత ఏడాదే సీఏల తొలగింపునకు రంగం సిద్ధం చేసినా.. నిర్ణయాన్ని చివరి క్షణంలో విరమించుకుంది. అయితే.. గత నెలాఖరులో అందరినీ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 1050 మంది వీఏలు ఉండేవారు. వీరిని మూడేళ్ల క్రితమే ఇంటికి పంపారు. సీఎంఎస్‌ఏ కార్యక్రమానికి  నిధులు రావాలంటే సెర్ప్‌ అధికారులు  నేషనల్‌ రూరల్‌ లైవ్లీహుడ్‌ మిషన్‌ (ఎన్‌ఆర్‌ఎల్‌ఎం)కు ప్రతిపాదనలు పంపాలి. గతేడాది పంపగా అక్కడి నుంచి బడ్జెట్‌ రావడంతో ఉద్యోగులను కొనసాగించారు. ఈ ఏడాది మాత్రం సెర్ప్‌ కార్యక్రమాలు ఎక్కువగా ఉన్నాయంటూ చేతులెత్తేసింది. అక్టోబర్‌కు ప్రోగ్రాంను ఎత్తివేసింది. 

    వేతనాలకు, 'వర్మీ'కి ముడి

    ఉద్యోగులకు ఎనిమిది నెలల నుంచి వేతనాలు రావడం లేదు.  డీఆర్‌డీఏ అధికారులను అడిగితే వర్మీకంపోస్ట్‌తో ముడిపెడుతున్నారు. ఒక్కో సీఏ 25 వర్మీకంపోస్ట్‌ యూనిట్ల నిర్మాణం పూర్తి చేసినట్లు సంబంధించి ఏపీఎంలు నివేదికలు ఇస్తేనే వేతనాలు ఇస్తామని తెగేసి చెబుతున్నారు.  వాస్తవానికి వర్మీకంపోస్ట్‌ యూనిట్లను డ్వామా, డీఆర్‌డీఏ అధికారులు సమన్వయంతో చేపట్టాలి. అయితే క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ సమస్యలు ఉన్నాయి. వాటిని పట్టించుకోని అధికారులు ఇలా వేధించడం ఎంత వరకు సమంజసమని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని డీఆర్‌డీఏ పీడీ దృష్టికి తీసుకెళ్లేందుకు సోమవారం కొందరు సీఏలు కార్యాలయానికి రాగా..ఆయన అందుబాటులో లేరు. దీంతో వారు సాయంత్రం వరకు నిరీక్షించి వెనుదిరిగారు.

     

    ఉద్యోగాలంటే ఇప్పుడు సాధ్యమా?

    2007లో ఉద్యోగంలో చేరా. ఇప్పుడు ఉన్నట్టుండి ఉద్యోగాల్లోంచి తీసేస్తే ఎలా? ఇతర ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. బాబు అధికారంలోకి వస్తే జాబు వస్తుందన్నారు. ఇలా తీసేయడం భావ్యం కాదు.

    – చెన్నమ్మ, సీఏ, కరుట్లపల్లి క్లస్టర్, కూడేరు మండలం

     

     

    మాకు న్యాయం చేయాలి

    ఈ ఉద్యోగాన్ని నమ్ముకుని ఉన్నాం. ప్రోగ్రాంను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగాల్లోంచి తొలగించడం సరికాదు. వేతనాలు కూడా ఎనిమిది నెలలవి రావాలి. ఇంత అన్యాయంగా చేస్తే ఎలా?

    – లక్ష్మినారాయణ, సీఏ, జిల్లిపల్లి, కూడేరు మండలం

     

    బడ్జెట్‌ ఉన్నా వేతనాలు ఇవ్వడం లేదు

    మాకు ఏప్రిల్‌ నుంచి వేతనాలు రావాలి. బడ్జెట్‌ కూడా ఉంది. అడిగితే వర్మీకంపోస్ట్‌ యూనిట్లు పూర్తి చేయాలని అంటున్నారు. దానికి బిల్లులు డ్వామా అధికారులు చేస్తారు. మేం రైతులకు అవగాహన కల్పించాం. పూర్తి చేయాలని కోరుతున్నా బిల్లులు రావని వాళ్లే ముందుకురావడం లేదు. దీనికి మేం బాధ్యులమా? మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి.

    – యువరాజు, సీఏ, ముట్టాల, ఆత్మకూరు మండలం

     

     

మరిన్ని వార్తలు