16కిలోల గంజాయి పట్టివేత

5 Aug, 2016 23:31 IST|Sakshi
16కిలోల గంజాయి పట్టివేత
ఎస్‌.కోటలో రహస్య అమ్మకాలు
 
 
శంగవరపుకోట:  ఏడాదిగా ఎస్‌.కోట పట్టణంలో గంజాయి పట్టుబడుతోంది. స్థానిక పోలీసులు ఇటీవల నిఘా పెంచడంతో పాటు,  ఏజెన్సీలో  పట్టిష్ట నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయటంతో వరుసగా గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతోంది. తాజాగా గురువారం సాయంత్రం ఎస్‌.కోట పోలీసులు మాటువేసి  గంజాయి అక్రమ రవాణాను అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో సీఐ బండారు రమణమూర్తి విలేకరుల సమావేశం నిర్వహించిన వివరాలు తెలిపారు. సీఐ రమణమూర్తి మాట్లాడుతూ ఎస్‌.కోట ఎస్సై రవికుమార్, కానిస్టేబుళ్లు అనిల్, రామునాయుడులు తమకు వచ్చిన సమాచారం ఆధారంగా గురువారం ఆర్టీసీకాంప్లెక్స్‌ వద్ద నిఘా పెట్టారు. ఇన్‌గేట్‌ వద్ద వేరే రాష్ట్రానికి చెందిన నలుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 16కిలోలు ఉన్న 8గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని, వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారిని మధ్యప్రదేశ్‌లో విదిశ జిల్లా, కొత్వాలీ తాలూకా సమీపంలో పొరుగు గ్రామాలకు చెందిన నలుగుర్ని రాజు అరివార్, పప్పూ రాజ్‌పూత్, నావెలింగ్‌ యహర్వారీ, బూరా యహర్వారీలుగా గుర్తించామని సీఐ చెప్పారు.  ఎస్‌.కోటలో ఒక వ్యక్తి నుంచి గంజాయి ప్యాకెట్లు తీసుకున్నామని వారు చెప్పారన్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ.80,000 ఉండొచ్చన్నారు. ఎస్‌.కోటలో వారికి గంజాయి ఇచ్చిన వ్యక్తి ఫోన్‌నంబర్‌ ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నామని, పట్టుబడ్డ నిందితులపై  ఎన్‌డీపీఎస్‌ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్టు చెప్పారు.  సమావేశంలో ఎస్‌.ఐ రవికుమార్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. 
 
 
మరిన్ని వార్తలు