కృష్ణ పుష్కరాలకు 170 కొత్త ఘాట్లు

21 Jan, 2016 19:48 IST|Sakshi

పెడన: కృష్ణా పుష్కరాల సందర్భంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొత్తగా 170 ఘాట్లు నిర్మిస్తామని దేవాదాయశాఖ మంత్రి పి.మాణిక్యాలరావు చెప్పారు. గురువారం ఆయన కృష్ణాజిల్లా పెడనలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గోదావరి పుష్కరాల అనుభవంతో కృష్ణా పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గోదావరి పుష్కరాల్లో జరిగిన అపశ్రుతి పునరావృతం కాకుండా అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పుష్కరాలను నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు మంత్రి వెల్లడించారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని మంత్రి వ్యాఖ్యానించారు. అతడి మృతికి కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతిఇరానీలను బాధ్యుల్ని చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. రోహిత్ ఆత్మహత్యను రాజకీయం చేసి విద్యార్థుల్ని రెచ్చగొట్టడం మంచిపద్ధతి కాదన్నారు. ఈ సమావేశంలో బీజేపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు రామినేని వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి చిరువోలు బుచ్చిరాజు, ఉపాధ్యక్షులు కట్టా జోతీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు