అమ్మో.. ఒకటో తారీఖు

30 Nov, 2016 23:09 IST|Sakshi
అమ్మో.. ఒకటో తారీఖు
 అందరిలోనూ ఇదే టెన్షన్‌
 జీతాలు వచ్చినా తీసుకునేదెలా
 పండుటాకుల పరిస్థితి అయోమయం
 ఏటీఎంలు మూత
 
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
ఒకటో తారీఖు వస్తోందంటే.. మధ్య తరగతి ఉద్యోగి ఆందోళన పడేవాడు. పెద్దనోట్ల రద్దు పుణ్యమా అని ఇప్పుడు అందరిలోనూ అదే టెన్షన్‌ నెలకొంది. బ్యాంకు ఖాతాల్లో జీతాలు జమ అయినా.. నగదు తీసుకునే అవకాశం లేకపోవడంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. ఏటీఎంల నుంచి రోజుకు రూ.2,500కు మించి డ్రా చేసుకునే అవకాశం లేకపోవడంతో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అడపాదడపా బ్యాంకులు, ఏటీఎంల నుంచి తీసుకున్న నగదు, తమవద్ద కొద్దోగొప్పో మిగిలి ఉన్న సొమ్ముతో ఇప్పటివరకూ నెట్టుకొచ్చారు. ప్రస్తుతం ఎవరివద్దా సొమ్ములు లేని పరిస్థితి. పోనీ.. రోజుకు రూ.2,500 తీసుకుని కాలం ఎలాగోలా గడుపుకుంటామన్నా.. ఇప్పటికే చాలా ఏటీఎంలు పని చేయడం లేదు. బుధవారం సాయంత్రం నుంచి జిల్లాలోని మొత్తం ఏటీఎంలు నగదు లేక మూతపడ్డాయి. దీంతో అందరి పరిస్థితి దారుణంగా తయారైంది. రానున్న రోజుల్లో ఏటీఎంలలో తగినంత నగదు పెట్టినా.. జీతం డబ్బులు తీసుకోవడానికి ఎన్నిరోజులపాటు క్యూలో నిలబడాలోనన్న ఆందోళన వేధిస్తోంది. బ్యాంకుల్లో డ్రా చేద్దామన్నా రూ.10 వేలకు మించి రావు. దీని కోసం కూడా చాంతాడంత క్యూలు...ఇంటి అద్దె, పాలు, స్కూల్‌ ఫీజులు, బస్సు చార్జీలు, కరెంటు, కేబుల్, ఫోన్‌ బిల్లులు, మందుల ఖర్చు వంటి వాటికి సొమ్ములు ఎలా సమకూర్చుకోవాలో అర్థంకాక సగటు మనిషి తల పట్టుకుంటున్నాడు. ఈ టెన్షన్‌ పండుటాకులకు మరింత ఎక్కువ కానుంది. గతంలో ప్రతినెలా ఒకటో తేదీన చేతికి అందే రూ.వెయ్యి కోసం ఇకపై ఏటీఎంల వద్ద క్యూలలో నిలబడి తీసుకోవాల్సి ఉంటుంది. పింఛనుదారులకు ఇచ్చే సొమ్మును వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అదేశాలు రావడంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 3లక్షల మంది పింఛన్‌దారులు ఉంటే అందులో 3 వేలమందికి బ్యాంక్‌ అకౌంట్లు లేవని జిల్లా అధికారులు చెబుతున్నారు. వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని సమాచారం. ఖాతావున్న వారు కూడా వాటిని ఉపయోగించకపోవడంతో అవి నిర్వహణలో ఉన్నాయో లేదో తెలియని పరిస్థితి. బ్యాంకు అకౌంటు ఉన్నా.. ఏటీఎం కార్డులు లేనివారి సంఖ్య అధికంగా ఉంది. ఇప్పుడు వారికి బ్యాంకుల్లో డబ్బులు వేస్తే ఆ వెయ్యి రూపాయల కోసం ఏటీఎం క్యూలలో నిలబడాల్సి వస్తుంది. ఏటీఎంలలో కూడా రూ.2 వేల నోట్లు మాత్రమే ఉండటంతో వీరు రూ.వెయ్యి  డ్రా చేసే పరిస్థితి లేదు. దీంతో వీరు బ్యాంకుకు వెళ్లి క్యూలో నిలబడాల్సి వస్తుంది. అన్ని గ్రామాల్లో బ్యాంకింక్‌ సేవలు అందుబాటులో లేవు. మరోవైపు 30వ తేదీనే బ్యాంకులకు జనం తాకిడి పెరిగింది. రూ.2 వేల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంకుల వద్ద బారులుతీరి ఉంటున్నారు. అయినా డబ్బులు చేతికి అందుతాయనే నమ్మకం లేదు. కొద్దిమందికి ఇచ్చి నో క్యాష్‌ బోర్డులు తగిలిస్తున్నారు. బ్యాంకు తెరిచిన గంటలోనే నగదు లేదని అధికారులు చెప్పడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెస్ట్‌ల నుంచి బ్యాంకులకు అరకొరగా డబ్బు వస్తుండటం వల్ల ఏం చేయలేకపోతున్నామని చెబుతున్నారు. ఎంతైనా నగదు డిపాజిట్‌ చేయండి.. మేము మాత్రం రూ.వెయ్యి మాత్రమే ఇవ్వగలమంటూ కొందరు బ్యాంకర్లు చేతులెత్తేస్తున్నారు. మరోవైపు రేషన్‌ దుకాణాల్లో నగదు రహిత సేవలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గురువారం నుంచి ప్రజలకు మరిన్ని కష్టాలు అనుభవంలోకి రానున్నాయి.
 
మరిన్ని వార్తలు