130 బార్లకు 2,100 దరఖాస్తులు

21 Oct, 2015 02:12 IST|Sakshi
130 బార్లకు 2,100 దరఖాస్తులు

- ఒక్కో బార్ కోసం 5 నుంచి 10 పేర్లతో అప్లికేషన్లు
- వచ్చే నెల 15 తరువాత డ్రా తీసే అవకాశం
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన నగర పంచాయతీల్లో బార్ల ఏర్పాటుకు వ్యాపారులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. జీహెచ్‌ఎంసీ, నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లు సహా మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కొత్తగా 130 బార్ల ఏర్పాటుకు ఎక్సైజ్‌శాఖ నోటిఫికేషన్ జారీ చేయగా 2,100 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో గ్రేటర్ పరిధిలో ఏర్పాటు చేయనున్న 60 బార్లకు దాదాపు 200 దరఖాస్తులురాగా, మిగతా 70 బార్ల కోసం ఏకంగా 1,900 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. దరఖాస్తులను పరిశీలించి, అర్హతగల దరఖాస్తులను ఎంపిక చేసే పనిలో సిబ్బంది ఉన్నారు. రాష్ట్రంలో గత జూన్ వరకు 756 బార్లు ఉండగా జనాభా ప్రాతిపదికన బార్ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి 13 వేల జనాభాకు, జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రతి 30 వేల జనాభాకు ఒక బార్ చొప్పున ఏర్పాటు చేసేందుకు మార్గదర్శకాలను రూపొందించింది.
 
 జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పుడున్న 497 బార్లకుగాను మరో 60 అదనంగా ఏర్పాటు చేసుకునే అవకాశం లభించింది. నిజామాబాద్ కార్పొరేషన్‌లో ప్రస్తుతం 7 బార్లు ఉండగా కొత్తగా మరో 4 ఏర్పాటు కానున్నాయి. అలాగే రామగుండం కార్పొరేషన్‌లో ప్రస్తుతమున్న 6 బార్లను 8కి పెంచనున్నారు. 21 నగర పంచాయతీల్లో 30 బార్లు, 20 మున్సిపాలిటీల్లో కొత్తగా 29 బార్లు ఏర్పాటు చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. నగర పంచాయతీలు, కొత్త మున్సిపాలిటీల్లో బార్లకు అవకాశం ఇవ్వడంతో స్థానికంగా ఉండే లాడ్జింగ్‌లు, రెస్టారెంట్లు, రిటైల్ మద్యం దుకాణాల యజమానులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు.

ఒక్కో బార్ కోసం ఒక్కొక్కరు వివిధ పేర్లతో 5 నుంచి 10 దరఖాస్తులు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. దరఖాస్తు ఫీజు కేవలం రూ. 5,000గా నిర్ణయించడంతో బార్ల కోసం బారులు తీరే పరిస్థితి ఏర్పడిందని ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా చెబుతున్నారు. మరోవైపు బార్ల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ హైదరాబాద్‌లోని ఆబ్కారీ భవన్‌లో మొదలైంది. ప్రస్తుతం సెలవులు కావడంతో ఈ నెలాఖరు వరకు పరిశీలన, కంప్యూటరీకరణ పూర్తి చేయనున్నారు. వచ్చే నెల 15 తరువాత స్క్రూటినీలో మిగిలిన దరఖాస్తులను ఆయా ప్రాంతాల వారీగా డ్రా తీసే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు