లీకేజీతో 20 మందికి ర్యాంకులు

29 Jul, 2016 23:16 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు
  • జిల్లాలో రూ.8 కోట్లకు పైగానే వసూళ్లు
  • ఎంసెట్‌–2 దళారుల కోసం వేట
  • పరీక్ష రద్దుతో నైరాశ్యంలో ర్యాంకర్లు 
  • వరంగల్‌  : ఎంసెట్‌–2కు సంబంధించి ప్రశ్నపత్రం కొనుగోలు చేయడం ద్వారా మెరుగైన ర్యాంకులు సాధించిన వారు జిల్లాలో ఇరవై మందికి పైగానే ఉంటారని చర్చ సాగుతోంది. పరకాల–భూపాలపల్లి ప్రాంతాల నుంచి రాసిన విద్యార్థులతో ఈ లీకేజీ వ్యవహారం బయటకు వచ్చినా మిగతా ప్రాంతాల్లోనూ మరికొందరు విద్యార్థులు తప్పకుండా ఉండి ఉంటారని తెలుస్తోంది. పరకాల– భూపాలపల్లికి చెందిన పది మంది ఎంసెట్‌–2 ప్రశ్నపత్రం సంపాదించడం ద్వారా వారి పిల్లలకు మెరుగైన ర్యాంకులు సాధించినట్లు సీఐడీ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు వ్యవహారంలో సంబంధం ఉన్న దళారులను పట్టుకునేని పనిలో పడ్డారు. 
     
    అయితే, వీరే కాకుండా  జిల్లాలో ఎంత మంది ఈ విధంగా ర్యాంకులు సాధించారనే అంశం సీఐడీ విచారణ పూర్తయితే తేలనుంది. జిల్లాలోని పలువురికి ఎంసెట్‌–2 ప్రశ్నపత్రం ఇవ్వడం ద్వారా సుమారు రూ.8కోట్లకు పైగానే దళారులు వసూలు చేసినట్లు సమాచారం. అయితే, ఇప్పటివరకు పది మంది విద్యార్థులను సీఐడీ గుర్తించినట్లు తెలుస్తుండగా.. మరో పది మంది కూడా ఉన్నారని వారికి సమాచారం అందినట్లు తెలుస్తోంది. అయితే, ప్రశ్నాపత్రం కోసం ఎవరెవరు డబ్బులు ఇచ్చారు.. తీసుకున్న వారెవరు, దీనికోసం తొలుత సంప్రదించిన దళారులెవరు తదితర అంశాలన్నీ ప్రస్తుతం సాగుతున్న విచారణలో వెల్లడయ్యే అవకాశముంది.
     
    కొందరు దళారులను అదుపులోకి తీసుకుని ప్రాథమికంగా విచారిస్తున్న పోలీసులు అసలు ఎంత మంది విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేశారు... వారు ఏయే ప్రాంతాల వారనే విషయమై లోతుగా ఆరా తీస్తున్నట్లు సమాచారం. విచారణ అనంతరం ఏయే ప్రాంతాల్లో ఎందరు విద్యార్థులకు ప్రశ్నపత్రం చేరింది, వారికి వచ్చిన ర్యాంకుల వివరాలు తేటతెల్లమయ్యే అవకాశాలున్నాయి. కాగా, ఎంసెట్‌–2 ప్రశ్నపత్రం కోసం అడ్వాన్స్‌ కింద ఒక్కొక్కరు సుమారు రూ.10లక్షలు చెల్లించారని విచారణలో తేలడంతో ఆర్థికంగా బలంగా ఉన్న వారికే ఈ వ్యవహారం ఉందని సీఐడీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఏదిఏమైనా విచారణ పూర్తయితే జిల్లాలో పలువురి పెద్దల భాగోతం బయటపడే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది.
     
    ప్రభుత్వ ప్రకటనతో..
     
    ఎంసెట్‌–2 ప్రశ్నపత్రం లీకేజీ ఘటనతో పరీక్షను రద్దు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. దీనిపై ఉన్నతాధికారుల భేటీ అనంతరం ఆయన నిర్ణయం తీసుకున్న విషయం మీడియాలో రావడంతో ర్యాంకర్లు పలువురు నిరాశ చెందారు. ప్రశ్నపత్రం లీకేజీ జరిగినట్లు వెలుగు చూసినప్పటి నుంచి పలువురు ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు ఆందోళనగానే గడుపుతున్నారు. కానీ బాధ్యులను గుర్తించడంతో పాటు ప్రశ్నపత్రం కొనుగోలు చేసి ర్యాంకర్లను పక్కనపెట్టి మిగతా వారికి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారన్న ఆశ వారిలో కొట్టుమిట్టాడింది. కానీ శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ ప్రకటనతో ఆయా విద్యార్థులు నైరాశ్యంలో కూరుకుపోయారు. ఇప్పటికే ఏపీ ఎంసెట్, తెలంగాణకు సంబంధించి ఎంసెట్‌–1, 2 పరీక్షలు రాసిన విద్యార్థులు మళ్లీ ఎంసెట్‌–3 పరీక్ష రాయాల్సి వస్తుండడంతో ఆవేదన వ్యక్తం చేశారు.
     
     
    కట్టుబడి ఉంటాం..
     
    వరంగల్‌ : ఎంసెట్‌–2 లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు స్పష్టం చేశారు. పరకాలలోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు గుండెబోయిన రవి, క్యాతం రమేష్, మేకల రమేష్, మేరుగు శ్రీనివాస్, ఆకుల కృష్ణ మాట్లాడారు. ఎంసెట్‌–2లో అవినీతి, అక్రమాలు జరిగాయనే అనుమానాలను పేరెంట్స్‌ కమిటీ ముందుగానే మీడియాకు విన్నవించగా వారి ఆధ్వర్యంలో ప్రభుత్వం దృష్టికి విషయం వెళ్లిందని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించగా.. ప్రశ్నాపత్రం లీకేజీ జరిగినట్లు అతి త్వరగా గుర్తించిన అధికారులు అభినందనీయులన్నారు.కాగా, తమ ప్రమేయం లేకుండా ఎలాంటి ప్రకటనలు, ఫొటోలను వేయవద్దని వారు ఈ సందర్భంగా కోరారు.
మరిన్ని వార్తలు