డయల్‌ 100కు 2351 కాల్స్‌

4 Oct, 2016 23:22 IST|Sakshi
వివరాలు తెలిపిన రూరల్‌ ఎస్పీ కె. నారాయణ్‌నాయక్‌
 
పట్నంబజారు: గుంటూరు రూరల్‌ జిల్లా పరిధిలో డయల్‌ 100కు మంచి స్పందన లభిస్తోందని రూరల్‌ ఎస్పీ కె. నారాయణ్‌నాయక్‌ చెప్పారు. ప్రజలు వారి సమస్యలపై ఫోన్‌ చేసిన తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవటంలో అధికారులు, సిబ్బంది పనితీరును అభినందించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గత సెప్టెంబరు నెలలో 2351 కాల్స్‌ వచ్చాయన్నారు. వాటిలో మనుషులపై దాడులకు సంబంధించి 451, స్త్రీలను ఇబ్బందులు, వేధింపులకు గురి చేసిన ఫోన్‌ కాల్స్‌ 221, రోడ్డు ప్రమదాలకు చెందినవి 901, ఆత్మహత్యకు చెందినవి 42, చోరీలకు సంబంధించి 29, ప్రజాశాంతికి భంగం ఇతర ఘర్షణలు, తగదాలు, గొడవలు, చిన్నపాటి వివాదాలకు చెందినవి 707 ఫోన్‌కాల్స్‌ వచ్చాయన్నారు. మొత్తం వచ్చిన2351 కాల్స్‌లో 48 కాల్స్‌ౖపై కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఆయా సబ్‌డివిజన్‌ల పరిధిలోని డీఎస్పీలతో పాటు, ఇతర అధికారులు, సిబ్బందితో కలిసి సమన్వయంతో పనిచేయిస్తున్నామని తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే అధికారులు, సిబ్బందిని ఘటనా స్థలానికి పంపటంతో పాటు అక్కడి స్థితిగతులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. చిన్నపాటి కేసులను స్టేషన్‌ ఎస్‌హెచ్‌వోల ద్వారా అప్పటికప్పుడే పరిష్కరిచంటంతో పాటు, భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నామని వివరించారు. డయల్‌ 100కు తప్పుడు సమాచారం ఇచ్చినా, ఆకతాయి ఫోన్‌కాల్స్‌ చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా డయల్‌ 100కు ఫోన్‌ చేయాలని సూచించారు.
మరిన్ని వార్తలు