ఈసారీ లేనట్లేనా?

16 Jun, 2017 22:13 IST|Sakshi

– పేద పిల్లలకు 25 శాతం ఉచిత సీట్లు హుళక్కే  
 – చట్టాన్ని అమలు చేయని ప్రైవేటు పాఠశాలలు
– ఇప్పటికే అడ్మిషన్లు పూర్తి


ధర్మవరం : విద్యాహక్కు చట్టానికి ప్రైవేటు పాఠశాలలు తూట్లు పొడుస్తున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత నిర్భంధ విద్యాహక్కు చట్టం ప్రకారం. అన్ని ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లను కేటాయించాలి. కానీ ఈ చట్టం తమకు వర్తించదన్నట్లు ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు వ్యవహరిస్తున్నాయి.  
 
పూర్తవుతున్న ఆడ్మిషన్లు ..
    జిల్లా వ్యాప్తంగా  అన్నీ ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్లు దాదాపు పూర్తికానున్నాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు వెయ్యిదాకా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలు ఉన్నాయి. అలాగే కొన్ని ప్రభుత్వ గుర్తింపులేని పాఠశాలలు ఉన్నాయి. జీఓ నెంబర్‌–1 ప్రకారం విద్యా సంవత్సరం ప్రారంభమైన రోజు నుంచి మాత్రమే అడ్మిషన్లు ప్రారంభించాల్సి ఉంది. ఆరు నెలల వరకు అడ్మిషన్లు కొనసాగించాలి. ఇక విద్యా హక్కు చట్టం ప్రకారం 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలి. అయితే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు   ప్రవేశ పరీక్షలు పెట్టి, డొనేషన్లు తీసుకుని విద్యార్థులను ముందస్తుగానే చేర్చుకుంటున్నారు.   కార్పొరేట్, కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో రూ. వేలల్లో అడ్మిషన్‌ ఫీజులు వసూలు చేస్తున్నారు. నెలసరి ఫీజులు రూ. వెయ్యి నుంచి రూ.5 వేల వరకు నిర్ణయించారు. కార్పొరేట్‌ పాఠశాలల్లో నర్సరీ విద్యార్థికి రూ.15 వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నారంటే వారి దోపిడీ  ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది.  ఈ–టెక్నో, ఈ– గవర్ననెన్స్‌అంటూ 6వ తరగతి నుంచి 10వ  వరకు రూ.25వేల నుంచి రూ.40వేల వరకు ఫీజులను నిర్ధారించారు. సాధారణ ప్రైవేటు పాఠశాలలు కూడా  అధిక ఫీజులను దండుకుంటున్నాయి. ఏ పాఠశాలలో కూడా గవర్నింగ్‌ బాడీని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకుని ఆ బాడీ నిర్ణయం మేరకు ఫీజులను వసూలు చేయడం లేదు. 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలన్న నిబంధనను ఏ పాఠశాల అమలు చేయడం లేదు.  25 శాతం సీట్లకు సంబంధించిన ఫీజులను ప్రభుత్వం వారికి చెల్లిస్తుంది. అయినా చాలా పాఠశాలలు ఈ చట్టాన్ని కనీసం పరిగణలోకి తీసుకోవడం లేదు.  ఇందులో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం, వారి తోడ్పాటు కూడా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్లన్ని పూర్తయిన తరువాత చట్టం అమలుపై ఒత్తిడి తెస్తే ప్రైవేటు పాఠశాలలు ఇప్పటికే అందులో చేర్చుకున్న విద్యార్థుల పేర్లను ప్రభుత్వ ఖాతాలో జమ చేసి.. అటు తల్లిదండ్రులతోనూ, ఇటు ప్రభుత్వం నుంచి డబ్బును డబుల్‌ ధమాకా రూపంలో దండుకునే అవకాశం లేకపోలేదు.  

కనిపించని ఉపాధ్యాయుల అర్హత, ఫీజుల పట్టిక..
    విద్యాహక్కు చట్టం ప్రకారం ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు నిర్వహిస్తున్న ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు విధిగా ఉపాధ్యాయుల అర్హత వివరాలను, ఫీజుల వసూళ్ల పట్టికను బోర్డుల ద్వారా ప్రదర్శనకు ఉంచాలి. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు విద్య బోధించేందుకు నియమితులైన ఉపాధ్యాయులు డీఎడ్, తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అరు నుంచి ఎనిమిదో తరగతి వరకు బీఈడీ తత్సమాన అర్హత కలిగిన ఉపాధ్యాయులు మాత్రమే బోధించాలి. అయితే అర్హతలేని వారు బోధిస్తున్న ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థలు జిల్లాలో అధికంగానే ఉన్నాయి.   అర్హతలేని ఉపాధ్యాయులే అధికం కావడంతో ప్రభుత్వ పాఠశాలలు మినహా ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయుల వివరాల పట్టిక కనిపించడం లేదు.

>
మరిన్ని వార్తలు