271 జీఓ రద్దు చేయాలి

31 Jul, 2016 22:57 IST|Sakshi
271 జీఓ రద్దు చేయాలి
  • 3, 4 తేదీల్లో తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద రైతుల ధర్నాలు
మండపేట : 
రైతులకు భూమిపై గల యాజమాన్యపు హక్కులను హరించే 271 జీఓను నిలిపివేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ మండపేట నియోజకవర్గ కోఆర్డినేటర్‌ వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ (రాజుబాబు), నీటి పంపిణీ సంఘాల రాష్ట్ర మాజీ కార్యదర్శి కొవ్వూరి త్రినాథరెడ్డి మాట్లాడారు. రైతు సంఘాలు, ఎవరితో సంప్రదించకుండా భూమిపై భరోసా కల్పించే యాజమాన్య హక్కును హరించేలా 271 జీఓ జారీ చేశారన్నారు. రైతులకు నష్టం కలిగించేలా ఉన్న ఈ జీవోతో భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లో భూ పోరాటాలు, కోర్టు వివాదాలు మొదలయ్యే ప్రమాదముందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. జీవోను నిలుపుచేయాలని డిమాండ్‌ చేస్తూ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 3, 4 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద విజ్ఞాపన పత్రాలు అందజేస్తున్నట్టు వారు తెలిపారు. పార్టీలకు అతీతంగా జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా మండపేట తహశీల్దార్‌ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎంవీ నాగిరెడ్డి పాల్గొంటారని పట్టాభిరామయ్య చౌదరి తెలిపారు. 

 

మరిన్ని వార్తలు