భార్యను చంపిన భర్తకు జీవితఖైదు

17 Nov, 2016 19:28 IST|Sakshi
రంగారెడ్డి: డబ్బు కోసం భార్యను హత్య చేసిన భర్తకు జిల్లా 2వ అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.6వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి గాంధీ గురువారం తీర్పునిచ్చారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రజని కథనం ప్రకారం.. కాప్రా యాదవబస్తీలో నివాసముండే జీనత్ యాస్మిన్, ఖాదర్‌ వలీ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. ఖాదర్‌ వలీ మద్యానికి బానిసై భార్యను డబ్బులు తెమ్మంటూ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. 
 
ఈ క్రమంలోనే 2014 మే 22వ తేదీన రూ.10 వేలు ఇవ్వమని భార్య జీనత్ యాస్మిన్‌ను అడుగగా ఆమె తిరస్కరించింది. దీంతో కోపం తెచ్చుకున్న ఖాదర్‌ వలీ ఇంట్లో ఉన్న కిరోసిన్ తీసుకుని భార్యపై పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన జీనత్ యాస్మిన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
 
యాస్మిన్ మరణ వాంగ్మూలం మేరకు కుషాయిగూడ పోలీసులు నిందితునిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించి కోర్టులో అభియోగ పత్రం నమోదు చేశారు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన 2వ అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జీ గాంధీ ఖాదర్ వలీకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు.
మరిన్ని వార్తలు