కుటుంబంపై కరెంటు కాటు

29 Jul, 2016 23:53 IST|Sakshi
మృతదేహాల వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు
  •  విద్యుదాఘాతంతో ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి 
  •  కుక్కను కాపాడబోయి తండ్రి, తండ్రి కోసం కొడుకు, కొడుకును కాపాడబోయి తల్లి 
  •  అప్రమత్తతతో కోడలికి తప్పిన ప్రమాదం 
  •  కోస్గి మండలం హన్మండ్లలో విషాద సంఘటన
  • అడవి పందులను నుంచి పంటను కాపాడుకునేందుకు ఓ రైతు పొలం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్‌ కంచె.. ఆ రైతు కుటుంబం పాలిట శాపంగా మారింది. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఆ కుటుంబంలో ఒకరిపై ఒకరికి ఉన్న మమకారం వెనకాముందు ఆలోచించకుండా ఆత్రుతతో ఒకరిని కాపాడబోయి మరొకరు వరుసగా... తల్లి, తండ్రి, కుమారుడు విద్యుదాఘాతంతో మృత్యువాతపడ్డారు. అప్రమత్తంగా వ్యవహరించిన కోడలు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఈ విషాదకర సంఘటన శుక్రవారం కోస్గి మండలంలోని తోగాపూర్‌ అనుబంధ గ్రామం హన్మండ్లలో చోటు చేసుకుంది. 
    – కోస్గి
     
    హన్మండ్లకు చెందిన తుడుం కిష్టప్ప (40) పొలం దగ్గర ఇంటిని నిర్మించుకుని, వ్యవసాయం చేసుకుంటూ తల్లిదండ్రులు అమృతమ్మ, వెంకటయ్య, భార్య యాదమ్మతో పాటు తన నలుగురు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. ఈ ఏడాది తన పొలంలో జొన్న, పత్తి, కంది, మిరప పంటలను సాగు చేశాడు. జొన్న పంటను అడవి పందులు నాశనం చేస్తుండటంతో పొలం చుట్టూ విద్యుత్‌ కంచెను ఏర్పాటు చేశాడు. ప్రతిరోజు రాత్రి ఏర్పాటు చేసి తెల్లవారే సరికి విద్యుత్‌ కంచెను తొలగించేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన కంచెను తొలగించడం మరిచిపోయిన కిష్టప్ప.. భార్య, తల్లితో కలిపి పత్తి చేనుకు మందు వేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో కిష్టప్ప కుటుంబం పెంపుడు కుక్క అటుగా వెళ్లి విద్యుత్‌ కంచె తగిలి మృతి చెందింది. పొలం వైపు వెళ్తున్న వెంకటయ్య(60)గమనించి, కుక్కను తీగ నుంచి బయటకు తీసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడే కుప్పకూలిపోయి, మృత్యువాతపడ్డాడు. స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు చెప్పడంతో ఇంటివద్ద ఉన్న పిల్లలు ఏడుస్తూ పొలం వైపు పరుగులు తీశారు. విషయం గమనించిన కొడుకు కిష్టప్ప తండ్రిని కాపాడే ఆత్రుతతో పొలం గట్టుపై నుంచి పరుగెత్తుతుండగా ప్రమాదవశాత్తు కాలికి విద్యుత్‌ కంచె తగిలి కిందపడి కొట్టుకుంటున్నాడు. అతని వెనుకనే వస్తున్న భార్య యాదమ్మ అప్రమత్తమై ‘నీ కొడుకును కరెంటు పట్టుకుంది.. దగ్గరకు వెళ్లకు, నేను వైరు తీసి వస్తాను’ అని అత్త అమృతమ్మ (58)ను హెచ్చరిస్తూ, ఇంటివైపు పరుగెత్తింది. కళ్లముందు ప్రాణాపాయ స్థితిలో కొట్టుకుంటున్న కొడుకుని చూసి ఆ మాతృ హృదయం తట్టుకోలేకపోయింది. కొడుకు చేయిపట్టి లాగేందుకు ప్రయత్నించగా.. ఆమె కూడా విద్యుదాఘాతానికి గురైంది. యాదమ్మ కరెంట్‌ తీసి వచ్చి చూడగా అప్పటికే భర్త, అత్తలు మృతి చెందడంతో బోరున విలపించింది. గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో రెవెన్యూ, పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు.
     
    దిక్కుతోచని స్థితిలో..
    కుటుంబంలో ఉన్న పెద్దలందరూ ఒకేసారి మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో కన్నీరు మున్నీరవుతోంది. మృతుడు కిష్టప్పకు ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. అవ్వ, తాతలతో పాటు తండ్రి మృతి చెందడంతో నిరాశ్రయులైన ఆ చిన్నారుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. అప్పటికే అనారోగ్యంతో ఉన్న రెండో కూతురు శిరీషా ఈ సంఘటనను చూసి తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయింది. పోస్టుమార్టం నిమిత్తం ముగ్గురి మృతదేహాలను ఒకే ట్రాక్టర్‌లో కొడంగల్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా గ్రామమంతా బోరున విలపించింది. కొడంగల్‌ సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐలు మల్లారెడ్డి, చంద్రశేఖర్, ఆర్‌ఐ అశోక్, వీఆర్‌ఓలు వెంకటయ్య, బుగ్యాసాబ్, ఈశ్వరమ్మ సంఘటన స్థలాన్ని సందర్శించి, ఘటన జరిగిన తీరును నమోదు చేసుకున్నారు. మృతుడు కిష్టప్ప భార్య యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మల్లారెడ్డి తెలిపారు.
మరిన్ని వార్తలు