ఖానాపురంలోకి మూడు గ్రామాలు

19 Sep, 2016 00:26 IST|Sakshi
ఖానాపురం : జిల్లాల పునర్విభజనలో భాగంగా మండలంలో మూడు గ్రామాలు నూతనంగా చేరనున్నాయి. ఖానాపురం మండలం వరంగల్‌ రూరల్‌ జిల్లాలో కొనసాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అదనంగా గ్రామాలు చేరనున్నట్లు సమాచారం. నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగుతున్న మండలంలో తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జిల్లాలోనే చిన్న మండలంగా ఉన్న ఖానాపురంలో చేరేందుకు గూడూరు మండలం చిన్న ఎల్లాపూర్‌, సీతానగర్‌, భూపతిపేట గ్రామాల ప్రజలు గ్రామ పంచాయతీల్లో తీర్మాణాలు చేసి కలెక్టర్‌ వాకాటి కరుణకు అందజేశారు. దీంతో ప్రజల అభిప్రాయాలు సేకరించి కలెక్టర్‌ ఆర్డీఓ రామకృష్ణారెడ్డిని ఆదేశించారు. ఈనెల 16న గూడూరు తహసీల్దార్‌ లక్ష్మి గ్రామ పంచాయతీల తీర్మాణాలు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయా గ్రామాల్లోకి వెళ్లి ఇటీవల గ్రామ సభలు సైతం నిర్వహించారు. ఒకరిద్దరు మినహా గ్రామాల్లోని ప్రజలు అధికసంఖ్యలో ఖానాపురంలో మండలంలో కలిసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. గ్రామసభల్లో ప్రజల అభిప్రాయాలు, తీర్మాణ కాపీలను శనివారం ఆర్డీఓకు అందజేసినట్లు తహసీల్దార్‌ లక్ష్మి తెలిపారు. ఖానాపురం మండలంలో ప్రస్తుతం 9 గ్రామ పంచాయతీలు ఉండగా చిన్న ఎల్లాపూర్‌, సీతానగర్‌, భూపతిపేట గ్రామాలు కలిస్తే గ్రామ పంచాయతీల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ మూడు గ్రామాల పరిధిలో 7వేల జనాభా ఉండగా 4500 ఓటర్లు ఉన్నారు.
మరిన్ని వార్తలు