30 కిలోల గంజాయి స్వాధీనం

22 Jun, 2016 14:07 IST|Sakshi

శృంగవరపుకోట:   కోటలో వరుసగా అక్రమ గంజాయి పట్టుబడుతోంది. స్థానిక పోలీసులు ఇటీవల నిఘా పెంచటంతో పాటూ,  ఏజెన్సీలో తగిన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయడమే దీనికి కారణం. తాజాగా సోమవారం రాత్రి అరుకు నుంచి వస్తున్న అక్రమ గంజాయిని ఎస్.కోట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో సీఐ లక్ష్మణమూర్తి విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం..

గంజాయి రవాణా జరుగుతుందన్న ఖచ్చితమైన సమాచారంతో సోమవారం రాత్రి ఎసై్స రవికుమార్ ఆధ్వర్యంలోని పోలీసు బృందం మాటు వేసి ఏపీ 31 టీఈ 5087 నంబరు గల ఆటోలో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నట్లు వివరించారు. ఒక్కసారిగా పోలీసులు రోడ్డుపై కనిపించడంతో వాహనంలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు పరుగు లంకించుకున్నారని, పోలీసులు చీకట్లో వారిని వెంబడించి ఒకరిని పట్టుకున్నట్లు తెలిపారు. మిగిలిన ఇద్దరు పరారైనట్లు వివరించారు.

పట్టుబడిన వ్యక్తిని విచారించగా తన పేరు పాగి ఇండోర్ అని, ఆయన పెదబయలు మండల పరిధిలోని కొరుగుడుపుట్టు గ్రామానికి చెందిన వాడినని వివరించినట్లు పేర్కొన్నారు. ఎస్.కోటకు చెందిన బాలస్వామి అనే వ్యక్తి సరుకు కొనమని చెప్పడంతో కొనుగోలు చేశామని, ఆటోలో 15 గోనెల్లో 30కిలోల గంజాయిని తీసుకువచ్చినట్లు పేర్కొన్నాడు. డాక్టర్ ఎం. హరి సమక్షంలో నిందితుని అదుపులోకి తీసుకున్నామని సీఐ వివరించారు.

స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ మార్కెట్‌లో రూ. 60 నుంచి 80 వేల వరకు ఉంటుందన్నారు. బాలస్వామిపై నిఘా పెట్టామని, ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నాడన్నారు. ఆటో రిజిస్ట్రేషన్ ప్రకారం భీమునిపట్నానికి చెందినదిగా గుర్తించినట్లు వివరించారు. ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి పట్టుబడిన వ్యక్తిని కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపారు.
 

మరిన్ని వార్తలు