భూములిస్తే రిజిస్ట్రేషన్లకు అనుమతి

5 Oct, 2016 23:31 IST|Sakshi
భూములిస్తే రిజిస్ట్రేషన్లకు అనుమతి
చిలకలపూడి :
భూసమీకరణలో భూములు ఇస్తామని అంగీకార పత్రాలు ఇస్తే రిజిస్ట్రేషన్‌  సౌకర్యం కల్పిస్తామని బందరు ఆర్డీవో పి.సాయిబాబు అన్నారు. ఆయన తన కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంఏడీఏ ద్వారా 33 వేల ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. ఇందుకోసం 21 గ్రామాలను పది యూనిట్లుగా ఏర్పాటు చేసి ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లను నియమించినట్లు తెలిపారు. భూసమీకరణకు అంగీకార పత్రాలు ఇస్తామని, తాము కొనుగోలు చేసిన భూములకు రిజిస్ట్రేషన్‌ సౌకర్యం కల్పించాలని కొంత మంది తమను కోరటం జరిగిందన్నారు. ఇందుకోసం భూసమీకరణకు అంగీకార పత్రాలు ఇచ్చే వారికి రిజిస్ట్రేషన్‌ సౌకర్యం కల్పించేలా కలెక్టర్‌ నుంచి ఆదేశాలు జారీ చేయించి రిజిస్ట్రార్‌ కార్యాలయానికి పంపిస్తామని పేర్కొన్నారు. భూసమీకరణలో గ్రామ కంఠాలు, గృహాలు కూడా పొందుపరిచారని కొంత మంది అపోహలో ఉన్నారన్నారు. గ్రామకంఠాలు, గృహాలను తాము సమీకరణలో చేర్చలేదని స్పష్టం చేశారు. అయితే గ్రామ కంఠాలు పక్కనే గృహాలు ఉండి వాటిని భూసమీకరణలో పొందుపరిచి ఉంటే వారి అభ్యంతరాలను స్వీకరించి తహసీల్దార్‌తో విచారణ చేయించి వాటిని తొలగించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. కార్యక్రమంలో బందరు తహసీల్దార్‌ కార్యాలయ డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు. 
 
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు