35 శాతం చెల్లిస్తే 65 శాతం మాఫీ

7 Aug, 2016 22:43 IST|Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌: గడువు మీరిన దీర్ఘకాలిక రుణాలకు సంబంధించి బకాయి పడిన రైతులు వన్‌టైం సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) పథకాన్ని సద్వినియోగం చేసుకుని రుణవిముక్తులు కావాలని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) అధ్యక్షుడు లింగాల శివశంకరరెడ్డి సూచించారు. బ్యాంకు సీఈవో కాపు విజయచంద్రారెడ్డితో కలిసి ఆయన సాక్షితో మాట్లాడారు. జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు, రైతుల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని గత నెల 31తో ముగిసిన ఓటీఎస్‌ పథకం గడువును ఆగస్టు నెలాఖరు వరకు పొడిగించేలా ఆప్కాబ్‌ను ఒప్పించామన్నారు.


తీసుకున్న అసలు, వడ్డీ మొత్తంలో రైతులు 35 శాతం చెల్లిస్తే మిగతా 65 శాతం మాఫీ చేస్తామన్నారు. జిల్లాలో ఇంకా రూ.73 కోట్లు మొండిబకాయిలు ఉన్నాయన్నారు. రైతులు, చేనేత కార్మికులు, మహిళలు, పేద వర్గాలకు బ్యాంకు ద్వారా సేవలు విస్తరించడానికి వీలుగా అంబ్రెల్లా ప్రోగ్రామ్‌ ఆఫ్‌ న్యాచురల్‌ రిసోర్సెస్‌ అనే కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ ప్రాజెక్టు కొలిక్కివస్తే ఎక్కువ మంది స్వయం సమృద్ధి సాధించడానికి అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. పాలకవర్గం సభ్యులు, అధికారులు, ఖాతాదారుల సహకారంతో ‘అనంత’ డీసీసీబీని రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలబెట్టడానికి శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు.  
 

మరిన్ని వార్తలు