3884 చెరువులకు జలకళ

23 Sep, 2016 00:32 IST|Sakshi
3884 చెరువులకు జలకళ
మత్తడి పోస్తున్న 1708 చెరువులు
పూర్తిగా నిండినవి 1208..  22 చోట్ల గండ్లు 
 
వరంగల్‌ : నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలోని చెరువులన్నీ జలకళ సంతరించుకున్నాయి. జిల్లాలో మొత్తం 5837 చెరువులున్నాయి. గురవారం నాటికి జిల్లాలోని 5550 చెరువుల వివరాలు అధికారులకు అందాయి. అందులో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో 3884 చెరువులు పూర్తిస్థాయిలో నిండాయి. గత వారం కురిసిన వర్షాలతో 1389 చెరువులకు మత్తళ్లు పడగా, ప్రస్తుతం 1708 చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి.  
 
గత ఐదేళ్లుగా నిండని చెరువులు సైతం ఇప్పుడు నిండుకుండల్లా మారడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్‌ ఐబీ డివిజన్‌ పరిధిలో 15, మహబూబాబాద్‌ డివిజన్‌ పరిధిలో 7 చెరువులకు గండ్లు పడ్డాయి. విస్తారంగా వర్షాలు పడడంతో గురువారం నాటికి 22 చెరువులకు గండ్లు పడినట్లు అదికారులు తెలిపారు. మిషన్‌ కాకతీయ కార్యక్రమంలో భాగంగా రెండు విడతలుగా చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టడం వల్ల బండ్‌ పటిష్టం కావడంతో చెరువుల్లో నీటి నిల్వలు పెరిగాయి. దీంతో అన్ని చెరువుల్లో జలకళ ఉట్టిపడుతోంది. మహబూబాబాద్‌ డివిజన్‌లో భారీ సంఖ్యలో చెరువులు నిండిపోయాయి. ఈ డివిజన్‌ పరిధిలో 7 చెరువులకు గండ్లు పడ్డాయి. ములుగు, స్పెషల్‌ ఎంఐ డివిజన్ల పరిధిలోని మండలాల్లోని చెరువులే ఎక్కువగా మత్తళ్లు పోస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలోని   చెరువులన్నీ దాదాపుగా నిండిపోయినందున మళ్లీ భారీ వర్షాలు కురిస్తే కట్టలు తెగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా నీటి ఎద్దడితో ఇబ్బంది పడిన ప్రజలకు ఇక ఆ సమస్య ఉండదు.
 
నిండుకుండల్లా నగరంలోని చెరువులు...
గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని చెరువులు నిండుకుండల్లా తయారయ్యాయి. పట్టణ ప్రాంతంలో మొత్తం 166 చెరువులు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు 119 చెరువులు మత్తళ్లు పోస్తున్నాయి. ఇందులో మినీ ట్యాంక్‌ బండ్‌లుగా రూపుదిద్దుకుంటున్న భద్రకాళి, రంగసముద్రంతో పాటు పలు చెరువులు మత్తళ్లు పోస్తున్నాయి. నగర పరి««ధిలోని చెరువులన్నీ ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌కు చేరుకున్నట్లు ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు. 
మరిన్ని వార్తలు