ఎమ్మెల్యే ఒత్తిడితో నలుగురి అరెస్టు

4 Dec, 2016 23:04 IST|Sakshi
కాకినాడ : 
ఏరు దాటాక తెప్ప తగలేసిన చందాన గతంలో తన గెలుపుకోసం కృషి చేసిన పలువురు కార్యకర్తలపై   కేసులు పెట్టించిన  ఎమ్మెల్యే తీరుపై ప్రత్తిపాడు నియోజకవర్గంలో నిరసన వ్యక్తమౌతోంది. కష్టకాలంలో ఆయనకు దన్నుగా ఉండి∙గత అసెంబ్లీ ఎన్నికల్లో సదరు ప్రజాప్రతినిధి విజయానికి కారణమైన నలుగురిపై  పోలీసుల ద్వారా ఒత్తిడి తెచ్చి కేసునమోదు చేయించి అరెస్టు చేయించడం ద్వారా ఆ ప్రజాప్రతినిధి తన అధికారదర్పాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే... ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఈ ఏడాది ఏప్రిల్‌ 8న టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ మారిన సమయంలో తనతోపాటు రావాలని అనుయాయులు పలువురిపై ఒత్తిడి తెచ్చారు. అయితే ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడుగా చెప్పుకొనే ఓ చోటా నాయకుడు కొందరిని పార్టీమారాలని హుకుం జారీచేశాడు. అయితే వారు ఒప్పుకోకపోవడంతో వారిపై కక్షకట్టారు. ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా యర్రవరంలో ఆయన ఫ్లెక్సీబోర్డు ఏర్పాటు చేశారు. దానిని గుర్తుతెలియని వ్యక్తులు «ధ్వంసం చేయడంతో ఇదే అదునుగా ఎమ్మెల్యే, అతని అనుచరులు  అప్పట్లో పార్టీఫిరాయింపునకు ఒప్పుకోని పెద్దనాపల్లికి చెందిన గొల్లపల్లి రాము, సూరిశెట్టి దుర్గ, పెంటకోట శ్రీను, బలిశెట్టి వీరబాబులపై అక్టోబర్‌ 30న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో వారిపై ఒత్తిడి తెచ్చి శనివారం వారిని అరెస్టు చేయించారు. ఎమ్మెల్యే, ఆయన అనుయాయుల తీరుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
 
>
మరిన్ని వార్తలు