కొత్త శాసనసభ భవన నమూనా కోసం పర్యటన

25 Nov, 2015 19:28 IST|Sakshi

అవనిగడ్డ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో కొత్తగా నిర్మించనున్న శాసనసభ భవన నిర్మాణ నమూనా కోసం ప్రత్యేక బృందం ఈ నెల 27 నుంచి నాలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నట్టు ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ వెల్లడించారు. కృష్ణాజిల్లా అవనిగడ్డలోని తన కార్యాలయంలో బుద్ధప్రసాద్ బుధవారం విలేకరులతో మాట్లాడారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారని, ఇందులో తనతో పాటు శాసనమండలి చైర్మన్ చక్రపాణి, ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు, బీజేపీ నుంచి విష్ణుకుమార్, వైఎస్సార్‌సీపీ నుంచి అమరనాథ్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ ఉన్నారని చెప్పారు.

ఈనెల 27న ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో పర్యటించి శాసనసభ మందిరాన్ని పరిశీలించనున్నట్టు తెలిపారు. అక్కడి స్పీకర్, శాసనమండలి అధ్యక్షులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్టు చెప్పారు. 28న వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. అనంతరం కేరళ, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి అసెంబ్లీ భవనాలను పరిశీలిస్తామన్నారు. వీటి నమూనాతో పాటు పలు సూచనలు, సలహాలతో స్పీకర్‌కి నివేదికను సమర్పిస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు