ఎగసిన దేశభక్తి తరంగం

26 Jan, 2017 23:35 IST|Sakshi
ఎగసిన దేశభక్తి తరంగం
- రాజమహేంద్రవరంలో 4 వేల మీటర్ల జాతీయ జెండాతో ప్రదర్శన
- పాల్గొన్న 10 వేల మంది
- వైఎస్సార్‌ సీపీ కార్పొరేటర్‌ శ్రీహరిని అభినందించిన ప్రముఖులు
సాక్షి, రాజమహేద్రవరం : గోదావరి తీర నగరం రాజమహేంద్రవరంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తి తరంగాలు ఉవ్వెత్తున ఎగిశాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్సార్‌ సీపీ నాలుగో డివిజన్‌ కార్పొరేటర్‌ బొంతా శ్రీహరి గురువారం 4 వేల మీటర్ల జాతీయ జెండాతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల వద్ద ఈ ప్రదర్శనను అర్బన్‌ ఎస్పీ బి.రాజకుమారి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, వైఎస్సార్‌ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ప్రారంభించారు. ఇలాంటి కార్యక్రమాలవల్ల ప్రజల్లో దేశభక్తి, ఐక్యత పెరుగుతాయని వారన్నారు. అనంతరం ఈ ప్రదర్శన టీటీడీ కల్యాణ మండపం, నందం గనిరాజు జంక్షన్, కంబాలచెరువు, దేవీచౌక్, గోకవరం బస్టాండ్‌ మీదుగా పుష్కర ఘాట్‌ వరకూ సాగింది. జాతీయ పతాకాలు చేబూని స్కేటింగ్‌ చేస్తూ చిన్నారులు, బుల్లెట్లపై సాగుతూ యువకులు ఈ ప్రదర్శనలో పాల్గొని, ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దాదాపు 10 వేల మంది విద్యార్థులు, నగర యువత, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వైఎస్సార్‌ సీపీ నగర కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రూరల్‌ కో ఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు, నగరపాలక సంస్థలో వైఎస్సార్‌ సీపీ ఫ్లోర్‌లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్లు మజ్జి నూకరత్నం, సుధారాణి, పిల్లి నిర్మల, బొండేసి మాధవి, మెర్సీప్రియ జాతీయ జెండాను ప్రదర్శించారు. ఏఎస్పీ గంగాధర్, డీఎస్పీలు జి.శ్రీకాంత్, జె.కులశేఖర్, రామకృష్ణ, పలువురు సీఐలు ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షించారు. జాతీయ భావం వెల్లివిరిసేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కార్పొరేటర్‌ బొంతా శ్రీహరిని నగర ప్రముఖులు ఘనంగా సత్కరించారు.
మరిన్ని వార్తలు