40 ఎకరాల్లో పంట ధ్వంసం

1 Aug, 2016 21:02 IST|Sakshi
పోడు భూముల్లో సాయుధులైన పోలీసు బలగాలు
  • టేకులపల్లి ఏజెన్సీలో ఉద్రిక్తం
  •  పరస్పరం తోపులాట.. ఇద్దరికి గాయాలు
  • టేకులపల్లి :ఏపుగా పెరిగిన పంటను అటవీ శాఖ అధికారులు ధ్వంసం చేశారు. కళ్లముందే పంట నేల పాలవుతుంటే గుండెలవిసిపోయిన గిరిజనులు రోదిస్తూ.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరస్పరం తోపులాటకు దిగడంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఒక గిరిజన మహిళ, ఫారెస్టు బీట్‌ ఆఫీసర్‌ స్పహ కోల్పోయారు. జూలై 23న పంట చేలను దున్నించేందుకు వచ్చిన అటవీ అధికారులను గిరిజనులు ప్రతిఘటించడంతో.. ఈసారి పోలీసు బలగాలతో తరలివచ్చి పంటను ధ్వంసం చేశారు. ఈ సంఘటన కొప్పురాయి పంచాయతీ పరిధిలోని ఒడ్డుగూడెం ఏజెన్సీలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. చాతకొండ రిజర్వ్‌ ఫారెస్టు, కొప్పురాయి బీట్‌ ఒడ్డుగూడెంలోని కంపార్ట్‌మెంట్‌ నం.30లో మొత్తం 200 హెక్టార్ల భూమి ఉంది. ఇందులోని 125(50 హెక్టార్లు) ఎకరాల్లో అటవీ శాఖ అధికారులు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు పూనుకున్నారు. అయితే ఈ భూముల్లో కొప్పురాయి, ఒడ్డుగూడెం, రాజారాంతండా, బర్లగూడెంకు చెందిన గిరిజనులు కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ భూముల్లోనే హరితహారం మొక్కలు నాటాలనే ఉద్దేశంతో కొత్తగూడెం ఎఫ్‌ఆర్‌ఓ మంజుల ఆధ్వర్యంలో 40 మంది అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, 10 మంది బోడు పోలీసుల సహాయంతో ఒడ్డుగూడెంలోని పంట భూముల్లోకి దున్నేందుకు ఉపయోగించే 10 ట్రాక్టర్లను తీసుకుని వెళ్లారు. పూనెం వీరస్వామి, చింత వసంతరావు, ఈసం శ్రీను, పెంటయ్య, పూనెం లక్ష్మయ్య తదితర రైతుల పంట చేలలోకి దూసుకెళ్లి ఏపుగా పెరిగిన మొక్కజొన్న, నువ్వు, పత్తి పంటలను ధ్వంసం చేసి.. దున్నడం మొదలు పెట్టారు. దీంతో గిరిజనులు ఆగ్రహంతో దున్నుతున్న ట్రాక్టర్లను, అటవీ అధికారుల చర్యలను అడ్డుకునేందుకు పరుగులు తీశారు. అటవీ శాఖ, పోలీసు అధికారులు, సిబ్బంది భారీ తాడు సాయంతో వారిని అడ్డుకున్నారు. బాధిత రైతులకు పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రైతులకు, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. మహిళా రైతులను అదుపులోకి తీసుకునేందుకు అటవీ శాఖ సిబ్బంది శత విధాల ప్రయత్నించారు. ఒకరిపై ఒకరు తోపులాటలు.. మట్టితో దాడులు చేసుకోవడం.. ఇరువర్గాలు దుర్భాషలాడుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైతుల బట్టలు చినిగిపోయే విధంగా ఫారెస్టు అధికారులు బలప్రయోగం చేసి అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. దీంతో బాధిత రైతులు తీవ్రంగా ప్రతిఘటించారు. భారీ సంఖ్యలో ఉన్న అటవీ, పోలీసు అధికారులు, సిబ్బంది రైతులను బలవంతంగా దూరంగా పంపించి  పంటలను నాశనం చేశారు. సుమారు 40 ఎకరాల్లో పంటలను ధ్వంసం చేశారు. మిగిలిన పంటను మంగళవారం ధ్వంసం చేయనున్నారు. కాగా, అటవీ శాఖ అధికారులు, రైతులకు మధ్య జరిగిన ఘర్షణలో చింత లక్ష్మి తలకు తీవ్ర గాయమై స్పహ కోల్పోయింది. ఇదే ఘటనలో ఫారెస్టు బీట్‌ ఆఫీసర్‌ గౌరమ్మకు కూడా గాయాలై అస్వస్థతకు గురైంది. వెంటనే ఇద్దరిని అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. రైతులకు మద్దతుగా వచ్చిన సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు ఎట్టి నర్సింహారావు, గంగారపు భాస్కర్‌ను పోలీసులు మందలించారు.  
     

     
     

మరిన్ని వార్తలు