ఆ కట్టడం నిర్మించడానికి 40 ఏళ్లు!

13 Aug, 2016 20:54 IST|Sakshi
ఆ కట్టడం నిర్మించడానికి 40 ఏళ్లు!

సాక్షి,వీకెండ్: చరిత్ర తలుపులు తట్టి... అలనాటి జ్ఞాపకాలను ఆస్వాదించాలంటే... వందల ఏళ్ల నాటి శిల్ప సంపద, కళా వైభవాన్ని కళ్లకు కట్టాలంటే... వరంగల్‌ జిల్లాలోని రామప్ప గుడికి వెళ్లాల్సిందే. మానవ నిర్మితమై అందాన్ని, కౌశల్యాన్ని, సృజనని చాటే ఆలయ నిర్మాణాల్లో ఈ గుడికి విశేష స్థానం ఉంది.       
                                     – ఓ మధు

రామలింగేశ్వరుడు కొలువున్నప్పటికీ ఈ ఆలయం రామప్ప ఆలయంగా ప్రసిద్ధి. దేశంలోనే శిల్పకారుడి పేరుతో పిలిచే ఆలయం ఇదొక్కటే. ఆలయ నిర్మాణ శిల్పుల్లో ప్రముఖుడైన రామప్ప పేరు మీదే ఈ ఆలయానికి ఆ పేరు వచ్చిందంటారు. దాదాపు 40 ఏళ్ల పాటు సాగిందని చెప్పే ఈ ఆలయ నిర్మాణంలో శిల్పకారుల శిల్పకళా నైపుణ్యం ఇప్పటికీ ఎప్పటికీ అబ్బురమే. పురాణ, ఇతిహాసాలతో కూడిన శిల్పాలు... వివిధ భంగిమలతో ఉన్న శిల్పాలు.. నంది మండపం, కామేశ్వర ఆలయాలు, చక్కటి శిల్పాలు చెక్కిన స్తంభాలు.. ఆలయంలో కొలువైన శిల్పకళా సౌందర్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్క మాటలో చెప్పాలంటే నృత్య రీతులకు స్ఫూర్తినిచ్చే శిల్పాలు ఇక్కడ అనేకం.

ఆద్యంతం... అద్భుత నిర్మాణం
కాకతీయుల పరిపాలనలో ఎంతో వైభవాన్ని చూసిన ఓరుగల్లు ప్రముఖ ప్రదేశాలలో రామప్ప గుడి ఒకటి. గణపతి దేవుని కాలంలో రేచర్ల రుద్రయ్య ఈ ఆలయ నిర్మాణం చేపట్టినట్లు ఇక్కడి శిలా శాసనాలు తెలియజేస్తున్నాయి. దక్కన్‌ పీఠభూమిలో ఉన్న ప్రముఖ ఆలయాల్లో రామప్ప ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దక్కన్‌ ఆలయాల సముదాయంలో ఒక నక్షత్రంగా, మణిమకుటంగా ఈ ఆలయాన్ని వర్ణిస్తారు చరిత్రకారులు. ఆరడగుల ఎల్తైన నక్షత్రాకార తలంపై  కాకతీయుల కళాభిరుచికి అద్దం పట్టేలా నీటిపై తేలే ఇటుకలతో నిర్మించిన ఈ ఆలయం ఇప్పటికీ ఒక ఆర్కిటెక్చరల్‌ వండర్‌.

ఎంత దూరం..
హైదరాబాద్‌కు సుమారు 160 కి.మీ దూరంలో ఉందీ ఆలయం. వరంగల్‌ నుంచి 70 కి.మీ. వెంకటాపురం మండలం పాలంపేట్‌ గ్రామంలో ఉన్న ఈ ఆలయానికి నగరం నుంచి బస్‌లో వెళ్లొచ్చు. ఈ గుడికి దగ్గర్లోనే రామప్ప చెరువు ఉంది. శివరాత్రి సమయంలో 3 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి.

మరిన్ని వార్తలు