434 పంచాయతీల్లో మగువలకే అధికారం

27 Jun, 2013 06:09 IST|Sakshi

 సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియపై అధికారుల కసరత్తు ముగిసిం ది. దాదాపు 500పైగా గ్రామ పంచాయతీ స్థానాల్లో మహిళలు పాగా వేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆర్డీవో, ఎంపీడీవోలు రిజర్వేషన్లు ఖరారు చేసి ‘ఆమోద ముద్ర’ కోసం కలెక్టర్‌కు పంపించారు. ప్రభుత్వం సంప్రదింపులు, సమాలోచనల అనంతరం జాబితాను నేడో, రేపో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 282 జీవో ప్రకా రం కోటాను అనుసరించి రోస్టర్ పద్ధతిన జీపీల రిజర్వేషన్లు తేలగా, ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదలే తరువాయిగా మారింది. 
 
 మహిళలకు పంచాయతీలు 500పైనే..!
 గ్రామ పంచాయతీ ఎన్నికలకు పంచాయతీరాజ్ శాఖ ఖరారు చేసిన కోటా ప్రకారం 866 గ్రామ పంచాయతీలకు 235 పంచాయతీలు షెడ్యూల్డ్ ప్రాంతాల్లో చేర్చగా, 631 నాన్ షెడ్యూల్డ్ ఏరియాల్లో ఉన్నాయి. 50 శాతం రిజర్వేషన్ల కోటా ప్రకారం వివిధ కేటగిరీలకు చెందిన 434 మంది మహిళలకు పంచాయతీల్లో పాగా వేయనున్నారు. ఇందులో షెడ్యూల్డ్ ఏరియాల్లో 118 మంది, నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో 316 మంది మహిళలు మహిళా రిజర్వేషన్ల ప్రకారం అధికారం చేజిక్కించుకోనున్నారు. జనరల్ స్థానాల్లోను మహిళలు ఆసక్తి చూపుతున్నందున మరో వంద ‘పంచాయతీ’లలో పాగా వేసే అవకాశం లేకపోలేదు. దీంతో ఎన్నికలు జరిగితే జిల్లాలో మహిళా సర్పంచ్ ల సంఖ్య 500 పైనే ఉంటుందన్న చర్చ సాగుతోంది.
 
 ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మహిళ అభ్యర్థులకు డిమాండ్ పెరగనుంది. అలాగే షెడ్యూల్డ్ తెగలకు 75, షెడ్యూల్డ్ కులాలకు 122, వెనుకబడిన తరగతులకు 237 పంచాయతీలు, జనరల్ కోటాలోని 622 గ్రామ పంచాయతీలు కేటాయించారు. అయితే అన్ని కేటగిరీల్లో మహిళలు, పరుషులు/మహిళలకు కేటాయించిన గ్రామ పంచాయతీలు, వార్డుల వివరాలు కలెక్టర్ ఆమోదముద్ర తర్వాత అధికారికంగా వెల్లడికానున్నాయి. ఇప్పటికే గ్రామస్థాయిలో గెలుపు గుర్రాల అన్వేషణలో పడిన రాజకీయ పార్టీలు సాధ్యమైనన్ని స్థానాలను చేజిక్కించుకునే వ్యూహంలో నిమగ్నం అయ్యాయి.

 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు