కొబ్బరి ముక్కల్లో రూ.44లక్షలు నష్టం

21 Jul, 2016 23:00 IST|Sakshi
కొబ్బరి ముక్కల్లో రూ.44లక్షలు నష్టం
  • రాజన్న ఆలయంలో తొమ్మిదోసారికి సాగిన వేలం
  • రూ.71.10 లక్షలకే కాంట్రాక్టర్‌కు అప్పగింత
  • వేములవాడ : వేములవాడ రాజన్న ఆలయంలో కొబ్బరిముక్కలు పోగుచేసుకునే వేలంలో రూ. 44 లక్షలు నష్టమొచ్చింది. గతంలో రూ.1.15 కోట్లకు టెండర్‌ కుదిరింది. ఈ ఏడాది (20 నెలలు)కిగాను గురువారం ఆలయ ఓపెన్‌స్లాబ్‌లో వేలం వేశారు. రూ. 71.10 లక్షలకే వేలం పాడడంతో గతంతో పోల్చితే ఏకంగా రూ.44 లక్షల మేర తగ్గినట్లయ్యింది. 
     
    రాజన్న దర్శనం కోసం వేములవాడ వచ్చే భక్తులు ఆలయ ఆవరణలో కొబ్బరికాయలు కొట్టడం ఆనవాయితీ. ఆ కొబ్బరి ముక్కలను పోగుచేసుకునేందుకు దేవాదాయశాఖ వేలం ద్వారా కాంట్రాక్టర్‌కు అప్పగిస్తూ వస్తోంది. టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు రాజన్న ఆలయంతోపాటు అనుబంధ దేవాలయాల్లోని కొబ్బరిముక్కలను కూడా పోగుచేసుకునే హక్కు ఉంటుంది. ఇందుకోసం రెండేళ్లకోమారు వేలం నిర్వహిస్తారు. పోయినసారి కొబ్బరిముక్కల సేకరణకు వేలం వేయగా.. ఓ కాంట్రాక్టర్‌ రూ.1.15 కోట్లకు దక్కించుకున్నాడు. ఆయన కాంట్రాక్ట్‌ గడువు ముగియడంతో రాజన్న ఆలయ అధికారులు టెండర్లు ఆహ్వానించారు.

    జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కొబ్బరిముక్కలకు ధర లేదంటూ కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకురాలేదు. ఏకంగా ఎనిమిదిసార్లు టెండర్లు ఆహ్వానించినా ఫలితం లేకుండాపోయింది. తొమ్మిదోసారి వేలం వేయగా.. లాల నర్సింగం అనే కాంట్రాక్టర్‌ రూ.71.10 లక్షల వరకు మాత్రమే పాడాడు. ఈ విషయమై ఆలయ ఈవో దూస రాజేశ్వర్‌ను వివరణ కోరగా నాలుగు నెలల నుంచి తొమ్మిదిసార్లు వేలం వేస్తున్నామని, ఎవరూ ముందుకురాలేదని, డెప్యుటీ కమిషనర్‌ రమేశ్‌బాబు ఆధ్వర్యంలో వేలం వేసి కాంట్రాక్ట్‌ను ఫైనల్‌ చేశామని పేర్కొన్నారు. గతంలో రెండేళ్లకుగాను వేలం వేశామని, ఈసారి మాత్రం కేవలం 20 నెలలకే కాంట్రాక్ట్‌ ముగుస్తుందని వివరించారు. అలాగే పాదరక్షలు భద్రపరిచే హక్కును పి.జనార్ధన్‌కు అప్పగించినట్లు ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో అలయ అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు