ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య

11 May, 2016 04:52 IST|Sakshi
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య

* కత్తులతో గొంతులు కోసి దారుణంగా చంపేసిన దుండగులు
* మృతులంతా రక్త సంబంధీకులే
* పాత కక్షలే కారణమంటున్న పోలీసులు

భైంసా: ఆదిలాబాద్ జిల్లా భైంసాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులను దుండగులు దారుణంగా చంపేశారు. పదునైన కత్తులతో గొంతులు కోసి హతమార్చారు. మంగళవారం ఉదయమే ఈ వరుస హత్యలు చోటుచేసుకోవడంతో పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భైంసా పట్టణంలో 61వ జాతీయ రహదారిపై నిర్మల్ చౌరస్తా వద్ద ఉన్న తుక్కు (స్క్రాప్) దుకాణంలో మాజీ కౌన్సిలర్ నియామతుల్లాఖాన్(60) తన అన్న కొడుకు యునూస్‌ఖాన్(34)తో మాట్లాడుతుండగా.. దుండగులు వారిపై కారం చల్లి కత్తులతో దాడికి దిగారు.

దారుణంగా గొంతులు కోసి చంపి పరారయ్యారు. దుండగులను అడ్డుకునేందుకు అక్కడే పనిచేస్తున్న అబ్దుల్ జబ్బార్, షేక్ అన్వర్‌లు ప్రయత్నించగా, వారిని కూడా గాయపర్చారు. అక్కడి నుంచి దుండగులు బార్‌ఇమామ్‌గల్లిలోని నియామతుల్లాఖాన్ ఇంటికి చేరుకున్నారు. ఆయన భార్య, మాజీ కౌన్సిలర్ వహిదాఖాన్(55)ను కూడా గొంతుకోసి హత్యచేశారు. అంతకుముందే నయాబాదిలోని నియామతుల్లాఖాన్ రక్త సంబంధీకులైన అక్రమ్‌బీ ఇంటిపై దాడికి తెగబడ్డారు. ఇంట్లో అనారోగ్యంతో మంచంపై విశ్రాంతి తీసుకుంటున్న అక్రమ్‌బీ(62)పై కత్తులతో దాడిచేసి హతమార్చారు. ఆ సమయంలో టీవీ చూస్తున్న పిల్లలు భయంతో పరుగులు పెట్టారు. 15 ఏళ్ల మనువరాలు అయేషా దుండగులకు అడ్డురావడంతో ఆమెను కూడా కత్తులతో తీవ్రంగా గాయపరిచి పారిపోయారు. అంబులెన్సులో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో అయేషా చనిపోయింది.
 
ఇద్దరూ మాజీ కౌన్సిలర్లే..
హత్యకు గురైన నియామతుల్లాఖాన్, ఆయన సతీమణి వహిదాఖాన్‌లు గతంలో ఎంఐఎం తరఫున కౌన్సిలర్లుగా పనిచేశారు. హత్యల విషయం తెలియగానే ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ జాబిర్‌అహ్మద్, పలువురు కౌన్సిలర్లు భైంసా చేరుకున్నారు. జాబిర్ అహ్మద్ అందరినీ అప్రమత్తం చేసి హత్యకు గురైన కుటుంబీకులందరికీ రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. మృతదేహాలకు భైంసా ఏరియా ఆస్పత్రిలో సాయంత్రం పోస్టుమార్టం నిర్వహించారు.
 
పాత కక్షలే కారణం..: డీఐజీ మల్లారెడ్డి
రెండు కుటుంబాల మధ్య ఉన్న పాత కక్షల వల్లే ఈ దారుణ హత్యలు జరిగి ఉండవచ్చని వరంగల్ రేంజ్ డీఐజీ మల్లారెడ్డి చెప్పారు. హంతకులను కఠినంగా శిక్షిస్తామన్నారు. మంగళవారం రాత్రి ఆయన  భైంసాలో ఓఎస్డీ పనసారెడ్డి, డీఎస్పీ అందె రాములు, నిర్మల్ డీఎస్పీ మనోహర్‌రెడ్డితో పరిస్థితిని సమీక్షించారు. జావిద్‌ఖాన్, నూరుల్లా ఖాన్‌తోపాటు పలువురు దుండగలు తల్వార్‌లతో ఈ హత్యలకు తెగబడ్డారని చెప్పారు. నియామతుల్లాఖాన్ కుమారుడిపై 2013లో జావిద్‌ఖాన్‌తోపాటు పలువురు దాడికి దిగారని, ఈ కేసులో ఆగస్టు 2015లో కోర్టు నిందితులకు మూడేళ్ల జైలుశిక్ష విధించినట్లు ఓఎస్డీ పనసారెడ్డి తెలిపారు. వారే ఈ హత్యలు చేసేందుకు కుట్ర పన్ని ఉంటారని డీఐజీ మల్లారెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు