విశాఖ బీచ్‌లో విషాదం

9 May, 2016 06:51 IST|Sakshi
విశాఖ బీచ్‌లో విషాదం

♦ సముద్రంలో ఐదుగురు గల్లంతు
♦ వారిలో ముగ్గురు విద్యార్థులు
♦ యారాడ బీచ్‌లో ఒకరి మృతి
 
 సాక్షి, విశాఖపట్నం: సరదాగా ఈతకు వెళ్లిన ఐదుగురు.. వేటకు వెళ్లిన ఒకరు వేరు వేరు చోట్ల సముద్రంలో మునిగిపోయారు. వీరిలో ఒకరి మృతదేహం ఒడ్డుకు చేరగా, ఐదుగురి ఆచూకీ లభ్యం కాలేదు.  కంబాల ధనరాజ్(20) తన ముగ్గురు మిత్రులతో కలసి యారాడ బీచ్‌లో చేపల వేటకు వెళ్లాడు. మధ్యాహ్నం వరకూ చేపలు పట్టారు. భోజనం చేసిన తర్వాత 2గంటల సమయంలో మళ్లీ వేట ప్రారంభించారు. ఆ సమయంలో ఓ అల ధనరాజ్‌ను బలంగా తాకింది. దీంతో అతను సముద్రంలో పడిపోయాడు. అతనిని రక్షించేందుకు స్నేహితులు తీవ్రంగా ప్రయత్నించి ఎట్టకేలకు ఒడ్డుకు చేర్చారు. కానీ అప్పటికే అతడు ప్రాణాలు విడిచాడు.

మరోవైపు ఆర్కేబీచ్‌లో మధ్యాహ్నం 3.40 నుంచి కొద్ది నిమిషాల వ్యవధిలోనే మూడు బృందాలకు చెందిన ఐదుగురిని అలలు లాక్కెళ్లిపోయాయి. ఆర్కే బీచ్ కాళీమాతా ఆలయం ఎదురుగా ఉన్న పెద్దరాయి ప్రాంతంలో ఒకరు గల్లంతవుతుంటే గమనించిన లైఫ్‌గార్డులు అతనిని రక్షించారు. అంతలోనే మరో ప్రమాదం జరిగింది. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలేనికి చెందిన 19 మంది విద్యార్థులు పిక్‌నిక్ కోసం ఆర్కేబీచ్‌కు వచ్చారు. వీరంతా టెన్త్ ఎగ్జామ్స్ రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

వీరిలో ప్రసాద్(16), శ్రావణ్‌కుమార్(16), శేషు(16) అనే విద్యార్థులు గల్లంతయ్యారు. అదే ప్రాంతంలో బిహార్‌కు చెందిన బాబర్‌ఖాన్(25), ఒడిషా కోరాపుట్‌కు చెందిన సీతన్న(30) గల్లంతయ్యారు. వీరంతా విశాఖ పోర్టులో రోజు కూలీలుగా పనిచేస్తూ జీవనం గడుపుతున్నారు. గల్లంతైన వారి కోసం లైఫ్‌గార్డులు చీకటి పడేవరకు వెతికినా వారి జాడ కానరాలేదు.

మరిన్ని వార్తలు