50 పడకలు.. 74 మంది రోగులు!

29 Jul, 2016 18:14 IST|Sakshi
రోగుల్ని పరిశీలిస్తున్న డాక్టర్‌
  • ఆసుపత్రి నిండా అతిసార బాధితులే
  • ఒకే బెడ్‌పై ఇద్దరికి చికిత్సలు
  • ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోగులు
  • పట్టించుకోని అధికారులు
  • జోగిపేట: జోగిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోజు రోజుకు అతిసార బాధితుల సంఖ్య పెరుగుతోంది. గురువారం 47 మంది ఉంటే.. శుక్రవారం నాటికి 74 మందికి పెరిగిపోయారు. ఆసుపత్రి 50 పడకలది కాగా... రోగులు మాత్రం 74 మంది వచ్చి చేరారు. చికిత్సలు అందించడంలో ఆసుపత్రి సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు.

    ప్రతి రోగికి తప్పనిసరిగా గ్లూకోజ్ బాటిల్ పెట్టాల్సి ఉండటంతో సిబ్బంది సరిపోవడం లేదు. అందోలు, పుల్కల్, కౌడిపల్లి మండలాలకు చెందిన అతిసార బాధితులు ఆసుపత్రిలో చేరుతున్నారు. కౌడిపల్లి మండలానికి చెందిన వారే సగానికిపైగా ఉన్నారు. ఆ గ్రామానికి చెందిన చిన్నారులు సైతం అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

    అందోలు మండలానికి సంబంధించి జోగిపేట, అన్నాసాగర్ ప్రాంతానికి చెందిన వారు అతిసార బాధపడుతున్నారు. జిల్లాలో అతిసార అదుపులో ఉందని జిల్లా వైద్యశాఖ అధికారులు ఒకవైపు ప్రకటనలు చేస్తుంటే మరోవైపు వందల సంఖ్యలో రోగులు పెరుగుతున్నారు. జోగిపేట ఆసుపత్రిలో డెలివరీ అయిన మహిళల కోసం కేటాయించిన గదుల్లో సైతం అతిసార బాధితులకు చికిత్సలు అందిస్తున్నారు.

    బాలింతను గదిలో నుంచి వరండాలోకి తరలించారు. అతిసార పేషెంట్ల మధ్య పసిబిడ్డలకు అనారోగ్యం చేస్తుందనే బయటకు షిఫ్ట్‌ చేసామని సిబ్బంది చెప్పారు. అతిసార బాధితులే ఉండటంతో ఇతర జబ్బుల వారు ఆసుపత్రికి వచ్చినా ఇన్‌ పేషెంట్లుగా చేరేందుకు నిరాకరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోగులకు ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

    అందుబాటులో మందులు
    అతిసార బాధితులకు మందులు అందుబాటులో ఉన్నాయి. ఎంత మంది వచ్చినా సిబ్బంది వెంటనే స్పందించి చికిత్సలు చేస్తున్నారు. కౌడిపల్లి, అందోలు మండలాల నుంచే ఎక్కువ రోగులు వస్తున్నారు. గ్రామాల్లో పరిశుభ్రమైన వాతావరణం లేకపోవడంతోనే ఇలాంటి జబ్బులు వస్తాయి. తాగునీటిని వేడి చేసుకోవాలి. తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
    - డాక్టర్ సత్యనారాయణ, జోగిపేట ఆసుపత్రి

మరిన్ని వార్తలు