సూర్యా @50*

13 Apr, 2016 16:42 IST|Sakshi
సూర్యా @50*

- 50 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రత.. వేడిమి ధాటికి జనం విలవిల

మణుగూరు:
సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో మంటలు పుట్టిస్తున్నాడు. రోహిణికార్తె ప్రవేశానికి 40 రోజుల మందే.. 50 డిగ్రీల ఉష్ణోగ్రతతో ప్రజల్ని విలవిలలాడిస్తున్నాడు. గడిచిన పదిరోజులుగా ఓక్కో డిగ్రీ పెరుగుతోన్న ఉష్ణోగ్రత బుధవారం 50 డిగ్రీల మార్కును చేరుకుంది. ఖమ్మంజిల్లా మణుగూరు పట్టణంలో ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు అత్యధికంగా 50 డిగ్రీల ఎండ తీవ్రత నమోదయింది.

కోల్‌బెల్ట్ కావటంతో సహజంగానే ఇక్కడ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అయితే, ఏప్రిల్‌లోనే 50 డిగ్రీలకు చేరుకోవటం అరుదు అని అధికారులు, స్థానికులు అంటున్నారు. ఎండకు తోడు వడగాలులు కూడా వీస్తుండటంతో జనం ఇళ్లలోనుంచి బయటికి వచ్చేందుకు భయపడుతున్నారు. దీంతో పలు పట్టణాల్లోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఇక రాజధాని హైదరాబాద్ లో మంగళవారం 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. అటు ఏపీలోని పలు నగరాల్లోనూ పరిస్థితి నిప్పులవానను తలపిస్తున్నది. గుంటూరు జిల్లా రెంటచింతల, విశాఖపట్నం వాల్తేరులో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

 

మరిన్ని వార్తలు